
చుక్కల జింక మృతి
దొరవారిసత్రం : అటవీ ప్రాంతంలో చుక్కల జింక మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు వివరాలు.. దొరవారిసత్రం నుంచి పూలతోట గ్రామం వైపు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో గాయపడి ఓ జింక మృతి చెందినట్లు కొందరు గుర్తించారు. ఈ జింకను వాహనాలు ఢీకొనడంతో గాయపడి అడవిలోకి వెళ్లి మృతి చెందిందా ? లేక వేటగాళ్లు వేటాడే సమయంలో గాయపరిస్తే చనిపోయిందా ? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి.
ప్లేస్‌మెంట్‌లపై అవగాహన
చంద్రగిరి: విద్యార్థులకు అందిస్తున్న ప్లేస్‌మెంట్‌లపై మంగళవారం ఎంబీయూ క్యాంపస్‌లోని దాసరి ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్లోబల్ డెలివరీ భాగస్వామి రాఘవేంద్ర కులకర్ణి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. కొత్త ఐటీ ట్రెండ్‌లు, నియామక ప్రక్రియలు, సేల్స్‌ఫోర్స్, సర్వీస్, జావా వంటి ప్లాట్‌ఫామ్‌లలో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్ గురించి వివరించారు. సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్ జితేందర్ సింగ్ మాట్లాడుతూ జెన్‌సీ ప్రోగ్రాం ద్వారా కాగ్నిజెంట్ 2026 ఫ్రెషర్స్ నియామకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నాగరాజ్ రామారావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సారథి, కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.ఢిల్లీబాబు పాల్గొన్నారు.
వేధింపుల కేసులో
భర్తకు ఏడాది జైలు
తిరుపతి లీగల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో చిత్తూరు, టీవీ నాయుడు వీధికి చెందిన కరణం ఉపేంద్రకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తిరుపతి, యశోద నగర్‌కు చెందిన కరణం పరమేశ్వరిని 2015లో కరణం ఉపేంద్ర వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అతను కర్ణాటకలో ఆంధ్రా బ్యాంక్ మేనేజర్‌గా ఉన్నారు. వివాహమైన కొన్నాళ్లకు అతను, కుటుంబ సభ్యులు ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె మహిళా పోలీసులకు భర్త ఉపేంద్రతో పాటు, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. కేసు పూర్వపరాల పరిశీలించిన జడ్జి నిందితుడు కరణం ఉపేంద్రకు మాత్రం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మిగతా నలుగురిపై కేసును కొట్టి వేస్తూ తీర్పులో పేర్కొన్నారు.

చుక్కల జింక మృతి