
యువతకు నైపుణ్య శిక్షణ కల్పించండి
తిరుపతి మంగళం : తిరుపతి జిల్లాలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమకు మద్దతు, ప్రోత్సాహకాలు ఇచ్చారా ? ఇండస్ట్రీ 4.0, డిజిటల్ తయారీ వంటి జాతీయ కార్యక్రమాల ద్వారా తిరుపతి యువతకు ప్రత్యక్ష లాభాలు వచ్చేలా కేంద్రం ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో చెప్పాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆధునిక సాంకేతిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కేంద్రబడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన ఇండస్ట్రీ 4.0 అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై లోక్‌సభలో ప్రశ్నించారు. వీటికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ సమాధానమిస్తూ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రాం కింద 2.79 లక్షలకు పైగా అభ్యర్థులను చేర్చుకుందన్నారు. ఈ కార్యక్రమం నాస్కామ్ సహకారంతో నడుస్తోందని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, త్రీడి ప్రింటింగ్, సైబర్ సెక్యూరిటీ మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యమన్నారు. ఇటీవల తిరుపతిలో ఏర్పాటైన నైలెట్ నైలెట్ కేంద్రంలో పైన పేర్కొన్న కోర్సులే కాకుండా పైథాన్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి కార్యక్రమాలను అందిస్తోందని తెలియజేశారు.