
వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం
● నెల్లూరు పర్యటనలో ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత ● వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి ● భూమన అభినయ్‌రెడ్డి డిమాండ్
తిరుపతి మంగళం : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి చూపుతోందని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ పర్యటనల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బుధవారం తిరుపతి పద్మావతిపురంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద వందలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుని చరిత్రలో నిలిచిందన్నారు. అధికారం ఉన్నా.. లేకపోయినా జనాదరణ కలిగిన ఏకై క నాయకుడు జగనన్న అని..ఆయన్ను చూసేందుకు వచ్చే జనప్రవాహాన్ని చూసి తట్టుకోలేక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ జనం రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న పర్యటనలో కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా జనప్రవాహాన్ని ఆపలేరన్నారు. జనాదరణ కలిగిన నాయకుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్ యార్డ్‌లో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన ఆయనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందన్నారు. నెల్లూరు పర్యటనలో కూడా సరైన భద్రత కల్పించకుండా ఏదైనా జరగరాని సంఘటన జరిగితే అందుకు కూటమి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నెల్లూరులో ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను, అభిమానులను నిర్బంధించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావన్నారు. కార్యక్రమంలో మేయర్ శిరీష, పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డితో పాటు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.