
అంతరిక్షంలో ఇస్రో అసామాన్య విజయాలు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): జీఎస్‌ఎల్వీ–ఎఫ్16 రాకెట్ ప్రయోగం విజయవంతం అయినందుకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి పంపడంలో ఘన విజయం సాధించినందుకు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యక్షులు డా.వి.నారాయణన్, షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్, షార్ శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. జీఎస్‌ఎల్వీ ద్వారా మరో అత్యాధునిక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడం ద్వారా అంతరిక్ష రంగంలో అసమాన విజయం ఇస్రో సాధించడం దేశానికి గర్వ కారణమన్నారు. ఈ ప్రయోగం, అంతరిక్ష రంగంలో భారత్–అమెరికా దేశాల పరస్పర సహకారంలో ఒక మైలు రాయిగా నిలుస్తుందని అభివర్ణించారు.
బాధ్యతల స్వీకరణ
తిరుపతి లీగల్: తిరుపతి ఎరచ్రందనం కేసుల విచారణ ప్రత్యేక సెషన్స్ కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఏ.అమరనారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఆయనను ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు
సైదాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుండడంతో సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు బుధవారం ముందస్తుగా నోటీసులు జారీచేశారు. సైదాపురం మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్‌యాదవ్, సొసైటీ మాజీ అధ్యక్షుడు శివకుమార్, మోహన్‌రావు, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు యోగిరాజుతోపాటు పలువురికి నోటీసులు అందజేశారు. అందులో ‘‘గతంలో జరిగిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనల్లో గొడవలు, తొక్కిసలాటలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలు ఉన్నాయి.. దీంతో మీరు, మీ అనుచరులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లకూడదు’’ అని పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,183 మంది స్వామివారిని దర్శించుకోగా 25,906 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
జీవశాస్త్రంపై ఆసక్తి పెంచాలి
తిరుపతి సిటీ: భవిష్యత్ తరాలకు జీవశాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు అధ్యాపకులు, మేధావులు చొరవ చూపాలని ఎస్వీయూ వీసీ సీహెచ్ అప్పారావు సూచించారు. బుధవారం ఎస్వీయూ స్టూడెంట్స్ వెల్ఫేర్, సాంస్కృతిక వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో టీటీడీకి చెందిన ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జీవశాస్త్రం, సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో భౌతిక, రసాయన శాస్త్రాల వంటి మూలశాస్త్రాలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు కృషి చేయాలన్నారు. జీవశాస్త్రం వంటి కోర్సులను విద్యార్థులు ఆసక్తితో చదవాల్సిన అవసరం ఉందని, అందులో ప్రావీణ్యం సాధించిన అభ్యర్థులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ మలేషియాకి చెందిన సీనియర్ అధ్యాపకులు డాక్టర్ మన్నూర్ ఇస్మాయిల్ షేక్, ఎస్వీయూ అధ్యాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్, సభ్యులు డాక్టర్ మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు.
యోగిరాజు, శివకుమార్‌కు నోటీసులు
అందజేస్తున్న పోలీసులు