
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి క్రైమ్: రాత్రి పూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పుత్తూరు డీఎస్పీ రవికుమార్, పుత్తూరు సీఐ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులున్న తమిళనాడుకు చెందిన మనీ అలియాస్ కోవిల్ మనీ (38), సురేష్ అలియాస్ గుణ(35), తిరుపతి మంగళంకు చెందిన కుమార్(29), మణికంఠ(25), పట్టుబడ్డారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ప్రభు(26), మణిగండన్(47) ఇద్దరు పరారీలో ఉన్నారని వివరించారు. వీరంతా పలుమార్లు జైలు కెళ్లి జైల్లో పరిచయాల వల్ల ముఠాగా ఏర్పడ్డాయని చెప్పారు. వీరి నుంచి 190 గ్రాముల బంగారు, 2.3 కిలోల వెండి ఆభరణాలను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.20.4లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసును ఛేదించడంలో పుత్తూరు పోలీసులు ఎంతగానో కృషి చేశారన్నారు. నిందితులందరిపై షీట్ ఓపెన్ చేస్తామన్నారు.