
బలవంతపు మార్గదర్శులు
● బంగారు కుటుంబాలకు ‘సంక్షేమం’ కోత? ● పీ4 మొదటి విడత సర్వేలో 80,350 ఎంపిక ● ముగిసిన రెండో విడత సర్వే ● 872 మంది మార్గదర్శులు ● 11,009 బంగారు కుటుంబాల దత్తత
తిరుపతి అర్బన్ : పీ4 పథకం (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్) ద్వారా అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని..అందుకు సంపన్న కుటుంబాలు ముందుకు రావాలని అధికారులు వారిపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా దత్తత తీసుకోమని చెప్పడం ఎంటీ అంటూ పలువురు మండిపడుతున్నట్లు చర్చ సాగుతోంది. సచివాలయ ఉద్యోగులు చేపట్టిన మొదటి సర్వేలో జిల్లా వ్యాప్తంగా 80,350 కుటుంబాలు పేదలు ఉన్నట్లు నివేదికలను అధికారులకు ఇచ్చారు. అయితే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని తేలడంతో వడపోతకు మరోసారి ఎంపీడీవోల నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించి ఈనెల 15 నుంచి 25 వరకు సర్వేలు నిర్వహించారు. అయితే రెండో విడత జాబితాను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.
పీ4 స్కీమ్‌కు సాయం చేసే సంపన్నులను మార్గదర్శులుగాను, సాయం పొందే పేదలను బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం నామకరణ చేసింది. దీంతో అధికారులు అలానే పిలుస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి, కొందరు మార్గదర్శులుగా సాయం అందించేందుకు వెనుకాడుతున్నారు. మార్గదర్శులుగా ఉండకపోతే ప్రభుత్వం తమపై రాజకీయ కక్షలకు పాల్పడుతుందేమోననే ఆందోళన మరికొందరిలో ఉంది. పారిశ్రామిక వేత్తలను మార్గదర్శులను ఒప్పించి ముందుకు తీసుకురావాలని, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులే మార్గదర్శులుగా మారాలని చంద్రబాబు సర్కారు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు డోలాయమానంలో పడ్డారు.
గెజిటెడ్ అధికారి కనీసం ఒక కుటుంబం దత్తత
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, గెజిటెడ్ ర్యాంకు కలిగిన అధికారి కనీసం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి. ప్రతి ఆసుపత్రి నుంచి ఐదుగురు మార్గదర్శులుగా మారాలని స్పష్టం చేసింది. ఉద్యోగులు కూడా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తోంది. తమ కుటుంబాలనే ఆర్ధికంగా బలోపేతం చేసుకోలేకపోతున్నామని, ఇప్పుడు ఇతరులను దత్తత తీసుకోవడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.