
శేషాచలంలో గజరాజుల ఘీంకారం
● తొలుత నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలో పంటపొలాల్లో బీభత్సం ● ఆపై శ్రీవారిమెట్టు మార్గంలోకి ప్రవేశం ● స్మగ్లర్ల కోసం ఎగుర వేసిన డ్రోన్‌లో 17 ఏనుగుల కదలికలు ● అప్రమత్తమైన అఽధికార యంత్రాంగం
చంద్రగిరి: ఇన్నిరోజులూ అటవీ సమీప గ్రామాలపై దాడులు చేస్తున్న గజరాజులు రూటుమార్చాయి. పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటు భక్తులు అధికంగా కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలోకి చేరు కోవడంతో అప్రమత్తమైన అధికారులు వాటిని అటవీ ప్రాంతంలోకి తరిమేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంట పొలాల్లోకి సు మారు 17 ఏనుగులు చేరుకున్నాయి. వరిపంటతో పాటు అర టి తోటలను తొక్కి నాశనం చేశాయి. అందినకాడికి పంటలను ఆరగించి బీభత్సం సృష్టించాయి.
స్మగ్లర్ల కోసం డ్రోన్లతో గాలిస్తుండగా!
నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంటలను నాశనం చేసిన గజరాజులు తెల్లవారుజామున శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం డ్రోను కెమెరాలతో గస్తీ కాస్తున్న అధికారులు ఏనుగుల మందను గుర్తించారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి టోకెన్లు పొందిన భక్తులు వాహనాలతో పాటు కాలినడకన వెళ్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం విజిలెన్స్, అటవీ, పోలీసు శాఖ అధికారులు మార్గంలోని శ్రీవినాయక స్వామివారి ఆలయం వద్ద భక్తులను నిలువరించారు. అనంతరం అటవీ అధికారులు ఏనుగుల మందను అడవులోకి తరిమేశారు. తరువాత భక్తులను టీటీడీ ఉచిత బస్సు ద్వారా శ్రీవారిమెట్టుకు తరలించారు. ఏనుగుల దాడుల్లో దెబ్బతిన్న పంటలను అటవీ అధికారులు పరిశీలించారు. ఏనుగుల దాడులతో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, అధికారులు తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు.

శేషాచలంలో గజరాజుల ఘీంకారం