
ఎస్వీయూలో ఉద్యోగుల ముష్టియుద్ధం
● తీవ్రగాయాలతో రుయాస్పత్రిలో చికిత్స ● ఆర్థిక లావాదేవీతోనే ఒకరిపై ఒకరు దాడి
తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఉద్యోగుల గొడవ రణరంగాన్ని తలపించింది. వర్సిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సోమవారం పరిపాలనా భవనం ఎదుట ముష్టి యుద్ధాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. తీవ్ర గాయాలపాలైన ఉద్యోగులు రక్త స్రావంతో రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలలోకి వెళితే.. ఎస్వీయూ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్న సుబ్రమణ్యం, శ్రీనివాసరావు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవులు జరుగుతుండేవని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో భాగంగా సుబ్రమణ్యం అనే ఉద్యోగికి తోటి ఉద్యోగి శ్రీనివాసరావు రూ.2 లక్షలు వరకు అప్పు ఉన్నాడని, గత రెండేళ్లుగా చెల్లించకుండా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నాడని తెలిసింది. దీంతో పలుసార్లు సదరు ఉద్యోగి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రమోషన్ విషయంలో తనకే రావాలి..అడ్డు తగలవద్దు..అంటూ ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం నెలకొనేదని తెలిసింది. దీంతో సోమవారం వర్సిటీ ఆవరణలో ఇద్దరూ తారస పడిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కారణంతో పాటు ప్రమోషన్‌కు అడ్డువస్తున్నారనే కోపంతో వారిద్దరి మధ్‌య మాటా మాటా పెరిగి, ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. తోటి ఉద్యోగులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశారు.
తీవ్ర గాయాలతో రుయాలో చేరిక
ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఉద్యోగులు తీవ్రగాయాలతో స్థానిక రుయాస్పత్రిలో చేరారు. శ్రీనివాసరావుకు తలపై గాయం కావడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. అలాగే మరో ఉద్యోగి సుబ్రమణ్యంకు సైతం బలమైన లో గాయాలు తగలడంతో ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇరువురు ఎస్వీయూ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.