
పేదల పక్షాన నిరంతరం పోరాటం
సైదాపురం: పేద రైతుల పక్షాన నిరంతరం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సైదాపురం మండలంలో పేదలు సాగు చేసుకుంటున్న నిమ్మతోటలను అధికారులు నేలమట్టం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన కమ్మవారిపల్లె గ్రామానికి వెళ్లారు. నిమ్మతోటలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు. పేద రైతులతో మాట్లాడారు. తాను నిరంతరం అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. నిమ్మచెట్ల తొలగింపుపై అధికారులకు సోమవారం హైకోర్టు అక్షింతలు వేయడంపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి, అధికారులకు కూడా ఓ కనువిప్పులాంటిదన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లును నరికివేయడం ఏమిటని ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ఏమిటన్నారు. ఇకనైనా అధికారులు నేతలు మాటలకు స్వస్తి పలికి పేదలకు సహాయం చేయాలని కోరారు. తాము ఎప్పుడు కోర్టులను గౌరవిస్తామన్నారు.
నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి
వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేద్దాం
వెంకటగిరి(సైదాపురం): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31వ తేదీన నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నెల్లూరు పర్యటన ఖరారైనట్లు తెలిపారు. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డితో నెల్లూరు సెంట్రల్ జైలులో ములాఖత్ అయి, పరామర్శించనున్నారని చెప్పారు. అనంతరం రోడ్డు మార్గంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారని పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి, జగనన్న పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.