15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Jul 29 2025 4:44 AM | Updated on Jul 29 2025 11:34 AM

-

పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగుకే ఉచితం పరిమితం 

 జిల్లాలో తీవ్రమైన బస్సుల కొరత 


 

తిరుపతి అర్బన్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత..మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలనే అంశం గుర్తు కొచ్చింది. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామంటూ మంత్రులు పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో 350 గ్రామాలకు పైగానే ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాలకే కాకుండా కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు తదితర ఆలయాలకు అవసరం మేరకు ఆర్టీసీ సర్వీసులు లేవు. దీంతో 50 వరకు అద్దె బస్సులను తీసుకుని పలు మార్గాల్లో నడుపుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో మాత్రమే..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రమే ఆర్టీసీ కేటాయింపు చేసిన బస్సుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జిల్లా దాటితే టిక్కెట్‌ తీసుకోవాల్సి ఉంది. మరోవైపు తిరుమలకు అవకాశం కల్పించలేదు. రోజుకొసారి మాత్రమే ఓ మహిళ ప్రయాణం చేయడానికి వీలుంటుందని ఆర్టీసీ అధికాకారులు చెబుతున్నారు. ఈ నెల 29వ తేదీన ఎండీ నిర్వహిస్తున్న డీఎంల సదస్సులో పూర్తి వివరాలను వెల్లడిస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఆదాయం రాని మార్గాల్లో పల్లె వెలుగు కట్‌
ఆదాయం రాని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులను నిలుపుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పవని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే 350 మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు నడవడం లేదు. ఉన్న పల్లెవెలుగు సర్వీసులను ఉచిత బస్సు స్కీమ్‌కు వినియోగిస్తే జిల్లాలోని ఏ గ్రామీణ ప్రాంతానికి పల్లెవెలుగు బస్సులు నడిచే పరిస్థితులు ఉండవని అంతా భావిస్తున్నారు.

కొత్త బస్సుల ఊసేదీ?
జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులు 300 మాత్రమే ఉన్నాయి. జిల్లాలో 12.50 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఉచితం అంటే 12.50 లక్షల మందికి మహిళలకు 300 బస్సుల్లో సర్దుబాటు చేయడం వీలుకాదని ఆర్టీసీ అధికారులే బాహటంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళుతున్న పల్లెవెలుగు సర్వీసులను ఉచిత బస్సుల కోసం ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే.. ఇక గ్రామీణ ప్రాంతాలకు ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ సర్వీసులు ఉండదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కొత్త బస్సుల ఊసేలేదు. పాడైన పది సర్వీసులను మాత్రమే కొత్త బస్సులుగా మార్పు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో డిపోకు 50 కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని పచ్చనేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆ ఊసేలేదు. మంగళం డిపో కేంద్రం 150 విద్యుత్‌ బస్సులను ఏర్పాటు చేస్తామంటూ కూటమి సర్కారు ఏడాదిగా చెబుతూనే ఉంది. అయితే ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. తిరుపతి జిల్లాలో 11 డిపోలున్నాయి. రాష్ట్రంలోనే డిపోలు ఎక్కువగా ఉన్న జిల్లానే కాకుండా రాబడిలోనూ ముందు వరుసలో ఉన్న జిల్లాగా తిరుపతికి పేరుంది. అయితే కొత్త బస్సులను ఏర్పాటు చేయకుండా ఉన్న పల్లెవెలుగు బస్సులను ఉచిత బస్సు పథకానికి వాడేస్తే అంతా గందరగోళం తప్పదంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

నేటి ఎండీ సమావేశంలో స్పష్టమైన సమాచారం
మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌పై మంగళవారం తిరుపతిలో జరగనున్న డీఎంల సమావేశంలో రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టమైన సమాచారాన్ని తెలియజేస్తారు. జోన్‌–4 పరిధిలోని 54 డిపోలకు చెందిన రాయలసీమ డీఎంలు ఈ సమావేశాన్ని హజరుకానున్నారు. ఆ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రధానంగా డీఎంలకు ఉచిత బస్సు స్కీమ్‌ నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. సమావేశం అనంతరం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తాం.
– జగదీష్‌, జిల్లా ప్రజా రవాణా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement