విరూపాక్షపురంలో కుల దురహంకారం
● బండి నెమ్మదిగా నడపమన్నందుకు గిరిజనులపై అగ్రకులాల మూకుమ్మడి దాడి
శ్రీకాళహస్తి: ద్విచక్ర వాహనాన్ని నెమ్మదిగా నడమన్నందుకు అగ్ర కులాలు గిరిజనులపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, విరూపాక్షపురం గిరిజన కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత గిరిజనుల కథనం మేరకు.. గద్దగుంట గ్రామానికి చెందిన వన్నెకాపు సుబ్రమణ్యం కుమారుడు చైతన్య శ్రీకాళహస్తి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో విరూపాక్షపురం ఎస్టీ కాలనీ వద్ద బండి వేగంగా నడపడంతో రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ఢీకొనబోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న నాగయ్య, వెంకటేష్ బండి నెమ్మదిగా నడపొచ్చు కదా..? అంటూ చైతన్యను నిలదీశారు. దీంతో అహం దెబ్బతిన్న చైతన్య రోడ్డుపైనే నాగయ్య, వెంకటేష్‌పై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా గద్దగుంటకు వెళ్లి మరో 20 మందిని వెంట తీసుకొచ్చి ఇంకోసారి నాగయ్య, వెంకటేష్ లపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అగ్రకులస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన నాగయ్య(60), వెంకటేష్(30)ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తొట్టంబేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గిరిజనులపై అహంకారపూరితంగా దాడికి దిగిన అగ్రకులస్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య డిమాండ్ చేశారు.
విరూపాక్షపురంలో కుల దురహంకారం


