జేసీగా గోవిందరావు బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆర్.గోవిందరావు బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఆయన సివిల్ సప్లయి కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తూ తిరుపతి జిల్లా ఇన్‌చార్జి జేసీగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు అనంతరం మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. అలాగే జేసీ చాంబర్‌కు వెళ్లి డీఆర్వో నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ రామాంజుల నాయక్ తదితరులు జేసీని మర్యాద పూర్వకంగా కలిశారు. అందరికి అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని జేసీ ఈ సందర్భంగా వెల్లడించారు.
21 నుంచి
ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు
తిరుపతి సిటీ: వచ్చేనెల 23 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈనెల 21వ తేదీ నుంచి రెండో విడత ప్రీ ఫెనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్‌లో మొదటి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించామని, పబ్లిక్ పరీక్షల కు విద్యార్థులను సన్నద్ధం చేసే దృష్టితో మరోసా రి ప్రీ ఫైనల్ నిర్వహించాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే మార్చి 16 నుంచి పది పబ్లిక్ జరగున్న నేపథ్యంలో పదో తరగతి విద్యా ర్థులకు వచ్చేనెల 17 నుంచి 24వ తేదీ వరకు ప్రీ ఫైనల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: చైన్నెకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ బుధవారం వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.


