ఆక్రమణలు అచ్చెరువు
చెరువుకట్టకు ఆనుకుని బఫర్‌జోన్‌లో అక్రమంగా ప్రహరీ
చెరువుకట్ట తెగ్గొట్టడంతో ఆక్రమణలను గుర్తించిన అధికారులు
నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ
●
చెరువు ప్రాణకోటికి జీవగర్ర..దాన్ని అభివృద్ధి చేసి నీటితో నింపితే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే చెరువుకు నేడు రక్షణ కరువు అవుతోంది. పైగా ఆ నీటి వన రు నేడు ఆక్రమణలు, రియల్టర్లకు ఆదాయాని కి అడ్డాగా మారింది. ఫలితంగా ఎకరాలకు ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు కనుమరుగవుతోంది.
వరదయ్యపాళెం: మండలంలోని కంచరపాళెం పంచాయతీ పరిధిలోని రెడ్డిగుంట చెరువు ఆక్రమణకు ఓ రియల్టర్ సిద్ధమయ్యాడు. ఆ దిశగా చెరువు కింద భాగంలో కంచరపాళెం దళితులకు చెందిన 60 ఎకరాల భూములను చైన్నెకు చెందిన రియల్టర్ కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల క్రితం ఆ భూములకు ప్రహరీ గోడ నిర్మాణంలో భాగంగా ఏకంగా తమ భూములకు ఆనుకుని ఉన్న రెడ్డిగుంట చెరువు భూ మిని సైతం దర్జాగా ఆక్రమించుకున్నాడు. చెరువుకు అవతలివైపు, ఇవతలివైపు ఆక్రమణతో పాటు చెరువు నుంచి వెళుతున్న కాలువలను సైతం పూడ్చి వేసి తమ రియల్ ఏస్టేట్‌కు సంబంధించిన భూమిలో అడ్డగోలుగా కలిపేసుకున్నారు. కాలువలో రూపురేఖలు లేకుండా చదును చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించాడు.
బఫర్ జోన్ పూర్తిగా ఆక్రమణ
రెడ్డిగుంట చెరువుకు సంబంధించి బఫర్ జోన్ పరిధిలో ఉన్న చెరువు భూమిని పూర్తిగా తమిళనాడుకు చెందిన రియల్టర్ ఆక్రమించుకున్నాడు. ఏకంగా చెరువుకట్టకు ఆనుకుని దర్జాగా ప్రహరీ గోడ నిర్మించుకున్నా ప్రశ్నించే దిక్కు లేదు. అంతేకాక చెరువు తూము నుంచి వెళ్లే కాలువను సైతం తమ రియల్ ఏస్టేట్ భూమిలోకి మళ్లించుకుని కాలువకు అడ్డంగా గోడ నిర్మించాడు. అంతేకాక చెరువు కొనకట్ట వద్ద కట్టను తెగ్గొట్టి మరీ కింద నుంచి ప్రహరీ నిర్మాణానికి పునాదులు వేశాడు. చెరువు లోతట్టు ప్రాంతం సైతం చెరువు భూమిని ఆక్రమంచి దర్జాగా ప్రహరీ గోడ నిర్మించుకున్నారు.
చెరువుకట్టకు గండి..
అధికారుల కంటపడిన ఆక్రమణ
రెడ్డిగుంట చెరువు ఆక్రమణకు పాల్పడిన రియల్టర్ ఏకంగా నాలుగు రోజుల కిందట ఇరిగేషన్ చెరువుకట్టను తెగ్గొట్టి అందులో నీటిని బయటకు తరలించి, చెరువు మట్టితో తమ భూమిని రియల్ వ్యాపారానికి అనుగుణంగా చదును చేసుకునేందుకు చేపట్టిన పన్నాగం స్థానిక గ్రామస్తుల కంటపడడంతో అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో చెరువుకట్ట తెగ్గొట్టిన సంఘటనపై గ్రామస్తులు సైతం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగిన చెరువుకట్టను పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు రెడ్డిగుంట చెరువు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఆ సందర్భంలో రియల్టర్ చెరువు చుట్టూ చేపట్టిన ఆక్రమణల భాగోతం వారి కంటపడింది. అంతేకాక ఇప్పటికే చెరువుకట్టను తెగ్గొట్టేందుకు వినియోగించి ఇటాచీ యజమానిపై కేసు నమోదు చేసి, దాన్ని సీజ్ చేశారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
రెడ్డిగుంట చెరువు
రియల్టర్ దురాక్రమణ
చర్యలు తీసుకుంటాం
రెడ్డిగుంట చెరువు చుట్టూ రియల్టర్లు నిర్మించిన ప్రహరీ గోడ కట్టకు సమీపంలో బఫర్ జోన్‌లో నిర్మాణం జరిగినట్లు అనుమానాలున్నాయి. తూము వద్ద వెళుతున్న కాలువకు అడ్డంగా ప్రహరీ గోడ నిర్మించడం చట్టరీత్యా వ్యతిరేకం. దీనిపై సంబంధిత భూయజమానికి నోటీసులు అందించి ఆక్రమణలను అడ్డుకుంటాం. కచ్చితంగా ఆక్రమణ లు జరిగిన చోట ప్రహరీ నిర్మాణం జరిగినప్పటికీ దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చెరువుకట్ట తెగ్గొట్టిన వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశాం. – రత్నాకర్ రెడ్డి, డీఈ,
సత్యవేడు ఇరిగేషన్ శాఖ సబ్ డివిజన్


