లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు
తిరుమల: తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో ముఖఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షలు కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాద రక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షల నిర్వహణ వ్యవస్థను టీటీడీ విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో, తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ విధానంలో భక్తులు తమ పాద రక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్లిప్ ఇస్తారని, ఆ స్లిప్‌లో పాద రక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నంబర్, బాక్స్ నంబర్, నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్‌ను స్కాన్ చేయగానే పాద రక్షలు ఉన్న కచ్చితమైన స్థానం డిస్‌ప్లే అవుతుందని, తద్వారా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాద రక్షలు తిరిగి అందజేయడం జరుగుతోందని అదనపు ఈఓ తెలిపారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.సత్య నారాయణ, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.


