పది టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీకాళహస్తి: పది టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం శ్రీకాళహిస్త మండలంలో చోటు చేసుకుంది. తిరుపతి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాల మేరకు సీఐ వెంకటరవి, ఎస్‌ఐ రామకృష్ణ నాయక్, సీఎస్డీటీ రవిచంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ వెంకటాద్రి, కానిస్టేబుల్ అయ్యప్ప నేతృత్వంలో దాడులు చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ముసలిపేడు మార్గంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్టు సమాచారం రావడంతో రామాపురం జలాశయం వద్ద బియ్యంతో వెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.3.51 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేవీబీపురం మండలం, కోవనూరు గ్రామానికి చెందిన వెంకటయ్య కుమారుడు కే.రాజేష్ (25)ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అనంతరం బియ్యా న్ని శ్రీకాళహస్తి ఎంఎల్‌ఎస్ కేంద్రానికి తరలించామని, నిందితునితోపాటు వాహనాన్ని శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
గోవింద ధామానికి భూమిపూజ
చంద్రగిరి: స్థానిక శ్రీనివాసమంగాపురం మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న గోవింద ధామంకు మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే పులివర్తినాని హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ చంద్రగిరి మండల ప్రజలకు ఇబ్బంది కలగకుండా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా వారి సౌకర్యార్థం ‘గోవింద ధామం’ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ గోవింద ధామం ఏర్పాటుతో చంద్రగిరి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. సర్పంచ్‌లు రేవతి, ముదికుప్పం రూపరామ్మూర్తి, జెడ్పీటీసీ చిల్లకూరి యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.


