తవ్వేస్తూ.. తరలిస్తూ!
● నాయుడుపేట చుట్టుపక్కల యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● స్వర్ణముఖి వంతెనల వద్ద అడ్డూఅదుపూ లేకుండా తరలింపు ● చెలరేగిపోతున్న కూటమి నేతలు
నాయుడుపేటటౌన్: స్వర్ణముఖి నదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో రాత్రీపగలు తేడాలేకుండా తవ్వేస్తున్నారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరు స్వర్ణముఖి నది వద్ద రెండు రైల్వే బ్రిడ్జీల సమీపంలో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇసుక తవ్వేది ఇక్కడే
మండల పరిధిలోని భీమవరం, చిగురుపాడు, అయ్యప్పరెడ్డిపాళెం, కల్లిపేడు, మూర్తిరెడ్డిపాళెం, మర్లపల్లి తదితర ప్రాంతాల్లో స్వర్ణముఖి నది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇసుకాసులు ధన దాహానికి గిరిజనుడు బలి
స్వర్ణముఖి నది నుంచి రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తు ట్రాక్టర్ అతి వేగానికి రెండు రోజుల కిందట లో గిరిజనుడు బలయ్యాడు. ఇసుక లోడ్డుతో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్‌ను తుమ్మూరు వద్ద బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాళెం మీక్సిడ్ కాలనీకి చెందిన ఈగ పులయ్య(26) మృతి చెందాడు.
ప్రమాదంలో రైల్వే బ్రిడ్జీలు
స్వర్ణముఖి నదిపై బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జీల సమీపంలో భారీగా ఇసుక తవ్వేస్తుండడంతో వాటికి ప్రమాదం పొంచి ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. రైల్వే అధికారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు ఇసుకను తమిళనాడుకు తరలించేందుకు డంపింగ్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
స్వర్ణముఖి నదిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే మండల పరిధిలోని పలు చోట్ల స్వర్ణముఖి నది వద్ద అడ్డుగా గోతులు తీశాం. మళ్లీ వీఆర్వోలను పంపించి పరిశీలిస్తాం. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం.
– మాగర్ల రాజేంద్ర, తహసీల్దార్, నాయుడుపేట
ఇసుక తవ్వకాలతో ప్రమాదం
స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్మంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కావడంలేదు. పట్టణ పరిధిలోని తుమ్మూరుతో పాటు పలు చోట్ల నదిలో భారీగా ఇసుక ఆగాధాలు ఏర్పడ్డాయి. పిల్లలు సరదాగా ఈతకెళ్తే అంతే.
– శివకవి ముకుందా, సీపీఎం పార్టీ నాయకులు, నాయుడుపేట
తవ్వేస్తూ.. తరలిస్తూ!
తవ్వేస్తూ.. తరలిస్తూ!
తవ్వేస్తూ.. తరలిస్తూ!
తవ్వేస్తూ.. తరలిస్తూ!


