ప్రాధాన్యం ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యం ఎక్కడ?

Apr 5 2025 12:14 AM | Updated on Apr 5 2025 12:14 AM

ప్రాధ

ప్రాధాన్యం ఎక్కడ?

వరి రైతు విలవిల

గిట్టుబాటు ధరలేక అవస్థలు

ఊసేలేని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

రేణిగుంట: వరి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. పంటకు గిట్టుబాటు ధరలేక..పెట్టుబడీ చేతికందక విలవిల్లాడుతున్నాడు. గత ఏడాది 80 కిలోల బస్తా రూ.2,300 పలికింది. అదే బస్తా నేడు రూ.1,500 నుంచి రూ.1,600 కూడా పలకకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. గతంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు జిల్లా నుంచి ఎక్కువగా వరి ధాన్యం తరలించేవారు. అయితే ప్రస్తుతం ఆంక్షలు కఠినతరం చేయడంతో మిల్లర్లు, దళారులు ధర అమాంతం తగ్గించేశారు.

తగ్గిన దిగుబడి

జిల్లాలో ఈ రబీలో 1,82,790 ఎకరాలలో వరిసాగు చేశారు. ఇప్పటికే సగానికిపైగా పంట నూర్పిడి పనులు పూర్తయ్యాయి. తూర్పు మండలాల్లోనే ఎక్కువగా వరి సాగైంది. సీజన్‌ ప్రారంభంలో ఎడతెరిపి లేని వర్షాలు, వెన్ను దశలో మంచుతీవ్రత కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 45 బస్తాలు రావాల్సిన దిగుబడి 30 బస్తాలకు పడిపోయింది.

సవాలక్ష ఆంక్షలు

ప్రభుత్వం 75 కిలోల ఏగ్రేడ్‌ వరి ధాన్యం రూ.1,700కు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గురించి సరైన అవగాహన లేకపోవడానికితోడు తేమశాతం, కేడి ధాన్యం, చెత్తాచెదారం వంటి ఆంక్షలు పెట్టడంతో రైతులు విధిలేక ప్రయివేటు మిల్లర్లు, దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏపీ సీడ్స్‌లో మరో రకంగా

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్‌) శ్రీకాళహస్తి కేంద్రంలో మేలిరకపు విత్తనాలను ప్రతియేటా సేకరిస్తున్నారు. ఈ సారి ఏపీ సీడ్స్‌లో దీర్ఘకాలిక రకాలైన వరిధాన్యం క్వింటాల్‌ రూ.2,900, స్వల్పకాలిక రకాలు రూ.2,450 వరకు ధర నిర్ణయించి సేకరిస్తున్నారు. ఇక్కడికి తీసుకొచ్చే ధాన్యం మళ్లీ రైతులకు విత్తనాలుగా అందిస్తున్న నేపథ్యంలో సేకరించే ధాన్యంలో ఏ మాత్రం నాణ్యత తక్కువైనా తిప్పి పంపేస్తున్నారు. నాణ్యత కోసం ల్యాబ్‌కు పంపి, అక్కడ ఆమోదం పొందితేనే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తారు. దీంతో చాలా మంది రైతులు ఏపీ సీడ్స్‌కు తాము పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి విక్రయం కోసం నిరీక్షిస్తున్నారు. ధాన్యం తీసుకున్న 20రోజుల్లోపు నగదును రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు.

వరిధాన్యం కొను‘గోల్‌మాల్‌’!

తిరుపతి అర్బన్‌: జిల్లాలో ఈ సారి సుమారుగా 5.65,000 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో వరి ధాన్యం కొనుగోలును ప్రారంభించిన సివిల్‌ సప్లయ్‌ అధికారులు మార్చి 31తో ముగించారు. ఈ రెండు నెలల వ్యవధిలో 65వేల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన 5,00,000 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని రైతులు దళారీ సహకారంలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఏప్రిల్‌ 30వ తేదీ వరకు వరి ఒబ్బిళ్లు ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అయితే మార్చి 31తోనే వరిధాన్యం కొనుగోలుకు స్వస్తి పలకడం విమర్శలకు తావిస్తోంది.

చాలా దుర్మార్గం

నాకు ఐదెకరాల పొలం ఉంది. గత ఏడాది రూ.2,300కు బస్తా వరిధాన్యం అమ్మాను. ఈ సారి దానికంటే ఎక్కువ ధర లభిస్తుందన్న ఆశపడ్డాను. కానీ ఈ సారి దిగుబడి తగ్గింది. ఎకరాకు 27 బస్తాలయ్యాయి. కోతయంత్రానికి గంటకు రూ.2,400 ఇచ్చి కోయించాను. తీరా మూడు రోజులు ఎండబెట్టి అమ్మేసరికి బస్తా రూ.1,600కు కూడా అడిగేవారే కరువయ్యారు.

– నాదముని, రైతు, చెర్లోపల్లి, శ్రీకాళహస్తి మండలం

80శాతం ఒబ్బిళ్లు పూర్తి

జిల్లాలో మార్చి 31కి 80శాతం పంట ఒబ్బిళ్లు పూర్తి చేశారు. మరో 20శాతం పంట మాత్రమే ఒబ్బిళ్లు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 30కి 100శాతం పంట ఒబ్బిళ్లు పూర్తి అవుతుందని అంచనాలు వేస్తున్నాం. ఆ తర్వాత ఖరీప్‌లో సాగు చేయాల్సిన పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తాం.

–ప్రసాద్‌రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

ప్రాధాన్యం ఎక్కడ? 1
1/3

ప్రాధాన్యం ఎక్కడ?

ప్రాధాన్యం ఎక్కడ? 2
2/3

ప్రాధాన్యం ఎక్కడ?

ప్రాధాన్యం ఎక్కడ? 3
3/3

ప్రాధాన్యం ఎక్కడ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement