‘దివ్య’మైన భవిత | - | Sakshi
Sakshi News home page

‘దివ్య’మైన భవిత

May 25 2024 1:00 AM | Updated on May 25 2024 1:00 AM

‘దివ్

‘దివ్య’మైన భవిత

● జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్న ఐఈఆర్పీలు ● సహకారం అందిస్తున్న ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, ● ఇప్పటి వరకు 205 మంది ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు ● సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించేందుకు జిల్లాలోని 34 భవిత కేంద్రాల ఐఈఆర్పీ(ఇంటిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌)లు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. సమగ్ర శిక్ష ద్వారా విద్యార్థి దశలోని మానసిక దివ్యాంగులకు విద్యాబుద్ధులు నేర్పించడం, ఫిజియోథెరపీ ఇవ్వడం, వారికి అవసరమైన పరికరాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే భవిత కేంద్రాలకు రాని ఇలాంటి ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి వారికి బంగారు భవిత అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించి వారిని భవిత కేంద్రాలకు రప్పించేలా ఐఈఆర్పీలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మానసిక దివ్యాంగులు, బుద్ధిమాంద్యం కలిగిన వారిని గుర్తించడంలో నిమగ్నమయ్యారు.

క్షేత్రస్థాయిలో గుర్తింపు

జిల్లాలోని 34 భవిత కేంద్రాల్లో 626 మంది మానసిక, బుద్ధి మాంద్యం కలిగిన విద్యార్థులు ఉన్నారు. వీరిలో అవసరమైన వారికి వారంలో ఒక రోజు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన సర్వేలో భవిత కేంద్రాలకు రాకుండా ఇంటి వద్ద 145 మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారంతో ఈ ఏడాది సెలవు రోజుల్లోనే సర్వే చేయాలని అధికారులు ఐఈఆర్పీలను ఆదేశించగా స్థానిక అంగన్‌వాడీలు, ఏఎన్‌ఏంల సాయంతో సర్వే ప్రారంభించారు. ఐఈ కో–ఆర్డినేటర్‌ డి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ వి.రామచంద్రారెడ్డి, ఐఈఆర్పీ వి.వెంకటరత్నం ఆధ్వర్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి ఇప్పటి వరకు 205 మంది విద్యార్థులను గుర్తించారు.

పిల్లలకు అలవెన్సులు

ప్రత్యేక అవసరాల పిల్లలకు నాలుగు రకాల అలవెన్సులను ప్రభుత్వం అందిస్తోంది. వీటిలో బడికి వచ్చే మానసిక, బుద్ధిమాంద్యం ఉన్న వారికి, ఇంటి వద్దే ఉంటున్న వారికి, ఆడపిల్లలకు అలవెన్సులు ఇస్తున్నారు. బడికి వచ్చే వారికి రీడర్‌ అలవెన్సు కింద రూ.200 చొప్పున పది నెలలకు రూ.2వేలు, ఆడపిల్లలకు ప్రత్యేకంగా గర్‌ల్స్‌ చైల్డ్‌ అలవెన్సు కింద రూ.200చొప్పున పది నెలలకు రూ.2వేలు ఇస్తున్నారు. హోమ్‌ బేస్డ్‌ అలవెన్సు కింద ఇంటి వద్దే ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి మాత్రమే రూ.200 చొప్పున పది నెలలకు రూ.2వేలు ఇస్తున్నారు. బడికి వెళ్లే వారికి పాఠశాలలో అందరి విద్యార్థులతో పాటు వీరికి యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు, షూ, టైలను అందజేయడంతో పాటు వీరికి అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు.

మెడికల్‌ అసెస్‌మెంట్‌ క్యాంపులు

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గత ఏడాది నవంబరులో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెడికల్‌ అసెస్‌మెంట్‌ క్యాంపులు నిర్వహించారు. ఈ క్యాంపుల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వైద్య నిపుణులతో పరీక్షలు చేయించి 599మందిని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను గుర్తించారు. పరికరాలు అందజేశారు.

చక్కటి భవిష్యత్‌

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారికి చక్కటి భవిష్యత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జిల్లాలోని అన్ని మండలాల్లో ఐఈఆర్పీలు సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు 205మంది పిల్లలను గుర్తించారు. వీరందరూ భవిత కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే వారికి ఎటువంటి పరకరాలు అవసరమో వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించి వాటిని అందించనున్నాం.

– శేఖర్‌, డీఈఓ, అడిషనల్‌ ప్రాజెక్టు

కో–ఆర్డినేటర్‌, సమగ్ర శిక్ష, తిరుపతి

‘దివ్య’మైన భవిత1
1/1

‘దివ్య’మైన భవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement