ఇద్దరితో సహజీవనం.. రెండో ప్రియురాలి చంపిన.. మొదటి ప్రియురాలు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరితో సహజీవనం.. రెండో ప్రియురాలి చంపిన.. మొదటి ప్రియురాలు

Dec 25 2023 1:14 AM | Updated on Dec 25 2023 11:17 AM

- - Sakshi

సుజాతపై మోజు తగ్గగానే ఆరు నెలల కిందట అదే తరహాలో భర్తతోపాటు ఇద్దరు పిల్లలను వదిలేసిన విద్యాలతను తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకుని ఇద్దరితోనూ సహజీవనం

తొట్టంబేడు (శ్రీకాళహస్తి) : శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం సమీపంలోని పంట కాలువలో శవమై తేలిన విద్యాలత అలియాస్‌ విద్య హత్యమిస్టరీ వీడింది. హత్య చేసింది ఆమె ప్రియుడి మొదటి ప్రియురాలు సుజాత అని శ్రీకాళహస్తి డీఎస్పీ భీమారావు తెలిపారు. శ్రీకాళహస్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు దారితీసిన తీరును డీఎస్పీ వివరించారు. తిరుచానూరు సమీపంలోని కొత్తపాళెం ఎస్టీ కాలనీకి చెందిన లీలావతి(50), రవికుమార్‌ దంపతుల కుమారుడు శశికుమార్‌ అదే కాలనీకి చెందిన ఇద్దరు బిడ్డల తల్లిగా ఉంటూ భర్త, పిల్లలను వదిలేసిన సుజాత(36)తో ఎనిమిదేళ్లుగా సహజీవనం సాగిస్తున్నాడు. అయితే సుజాతపై మోజు తగ్గగానే ఆరు నెలల కిందట అదే తరహాలో భర్తతోపాటు ఇద్దరు పిల్లలను వదిలేసిన విద్యాలతను తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకుని ఇద్దరితోనూ సహజీవనం చేయడం మొదలెట్టాడు.

 శశికుమార్‌తో విద్యాలత సహజీవనానికి రావడం నచ్చని సుజాత తరచూ విద్యాలతతో గొడవకు దిగేది. ఇదే సమయంలో ప్రియుడు శశికుమార్‌, విద్యాలత కువైట్‌ వెళ్లాలని చర్చించుకోవడం చూసిన సుజాత ఎలాగైనా విద్యాలత అడ్డుతొలగించుకోవాలని భావించింది. విద్యాలతను మట్టుపెట్టాలని సుజాత, శశికుమార్‌ తల్లి లీలావతితో కలిసి వ్యూహరచన చేసింది. ఈ నెల 16న శశికుమార్‌ ఇంట్లో లేని సమయంలో రాత్రి విద్యాలత నిద్రిస్తుండగా ముఖంపై దిండుతో అదిమి హతమార్చారు. మృతదేహాన్ని ప్లాస్టిక్‌ గోనెసంచిలో మూటగట్టారు. ఓ ఆటోను బాడుగకు మాట్లాడుకున్న సుజాత, లీలావతి మూటను ఆటోలో పెట్టుకుని అక్కడి నుంచి శ్రీకాళహస్తికి బయలుదేరారు. మిట్టకండ్రిగ వద్దకు రాగానే తొండమనాడు మార్గంలో అమ్మపాళెం క్రాస్‌ వద్ద అర్ధరాత్రివేళ మూట దించుకుని ఆటోడ్రైవర్‌ను అక్కడి నుంచి పంపేశారు.

అనంతరం సమీపంలోని పంట కాలువలో విద్యాలత మృతదేహాన్ని పడేసి దానిపై కొబ్బరిమట్టలు కప్పి అక్కడ నుంచి తాపీగా నడుచుకుంటూ మిట్టకండ్రిగకు చేరుకుని బస్సులో ఇంటికి వెళ్లిపోయారు. 17న ఉదయం కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ అజయ్‌కుమార్‌ సిబ్బందితో అక్కడకు చేరుకుని గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రా రంభించారు. మృతురాలి చేతిపై ఉన్న టాటూకు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడంతో దామినేడుకు చెందిన పుష్ప అనే మహిళ మృతురాలు తన కుమార్తె విద్యాలతగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే దర్యాప్తు ప్రారంభించిన సీఐ నిందితులు సుజాత, లీలావతిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తక్కువ సమయంలోనే కేసును ఛేదించారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించినట్లు చెప్పారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరచడంతో జిల్లా ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. రివార్డులు అందుకోనున్న రూరల్‌ సీఐ అజయ్‌కుమార్‌తోపాటు, ఏఎస్‌ఐ రాజు, కానిస్టేబుళ్లు వేమారెడ్డి, ఉదయ్‌కుమార్‌, ధనంజయ, భరత్‌, నాగరాజును డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement