‘మల్టీజోనల్‌’లోనూ మడత పేచీ 

As Per Zonal Policy Government Announced Principals Seniority List - Sakshi

హెచ్‌ఎంల సీనియారిటీ జాబితా వెల్లడి 

మల్టీజోన్‌–1 నుంచి 2కు 40 మంది, జోన్‌–2 నుంచి 1కి 58 మంది 

కేవలం జిల్లా ఆప్షన్లు ఇవ్వమంటూ ఆదేశాలు..

పోస్టులు ఎక్కడ ఉన్నాయో ప్రకటించని విద్యాశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ విధానంలో భాగంగా ప్రభుత్వం బుధవారం మల్టీ జోనల్‌ పరిధిలో ఉన్న ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించింది. దీనిప్రకారం మల్టీజోన్‌–1 నుంచి జోన్‌– 2కు 40 మందిని, జోన్‌–2 నుంచి జోన్‌–1కి 58 మందిని కేటాయించింది. అయితే జిల్లా కేడర్‌ కేటాయింపు మాదిరిగానే మల్టీ జోనల్‌ కేటాయింపు ప్రక్రియ కూడా అత్యంత వివాదాస్పదమైంది. హెచ్‌ఎంలను రాష్ట్ర స్థాయిలో ఏ స్కూలుకు పంపాలనేది విభజన సందర్భంగానే తేల్చాల్సి ఉంటుంది. కానీ హెచ్‌ఎంలను కేవలం జోన్లకు మాత్రమే కేటాయించారు.

కానీ ఏ జిల్లాలో ఏ స్కూలుకు పంపుతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఏ జిల్లాకు ఎంతమంది హెచ్‌ఎంలనేది మాత్రం చెప్పా రు. కానీ ఆయా జిల్లాల్లో ఎక్కడ పోస్టులు ఉన్నా యో వెల్లడించలేదు. పైగా జిల్లా అప్షన్లు ఇవ్వమని అడిగారు. దీంతో పోస్టులెక్కడున్నాయో తెలియకుండా ఆప్షన్లు ఎలా పెట్టుకుంటామని హెచ్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమది మల్టీ జోనల్‌ కేడర్‌ పోస్టు అయినప్పుడు జిల్లా అధికారులకు తమ పోస్టింగ్‌ వ్యవహారం ఇవ్వడమేంటని ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించే ప్రయత్నాలు చేశామని, కానీ ఎవరి నుంచీ సరైన సమాధానం రాలేదని టీచర్ల యూనియన్లు చెప్పాయి.  

ఖాళీలను ప్రకటించాలి: టీఎస్‌ యూటీఎఫ్‌
నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలకు ఆప్షన్‌ ఇవ్వమనటాన్ని టీఎస్‌ యూటీఎఫ్‌ ఖండించింది. హైస్కూల్‌ హెచ్‌ఎం పోస్ట్‌ను మల్టీ జోనల్‌ పోస్ట్‌గా మార్చిన తర్వాత ఆ మల్టీజోన్‌లోని ఏ పాఠశాలనైనా నేరుగా ఎంచుకునే అవకాశం హెచ్‌ఎంలకు ఉంటుందని, కానీ జిల్లాను ఎంచుకుంటే ఆ జిల్లాలో పోస్టింగ్‌ ఇస్తామని అధికారులు చెప్పడం నిబంధనలను ఉల్లంఘించటమేనని సంఘం అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి చావా రవి చెప్పారు. హెచ్‌ఎంల సంఖ్యకు సరిపడా ఖాళీలను చూపించిన తర్వాత మాత్రమే ఆప్షన్లు తీసుకోవాలని కోరారు.  

జిల్లా ఆప్షన్లు ఇవ్వమంటే ఎలా?: పీఆర్బీ ప్రకాశ్‌ 
‘హెచ్‌ఎంలు మల్టీ జోనల్‌ కేడర్‌. అయినాప్రభుత్వం జిల్లా కేడర్‌కు కేటాయించడం దారుణం. పోస్టులు ఎక్కడున్నాయో ప్రకటిస్తే మేం నచ్చిన ఆప్షన్‌ ఇవ్వొచ్చు. కేవలం జిల్లాల ఆప్షన్లే ఇవ్వమంటే ఎలా?’ అని హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీఆర్బీ ప్రకాశ్‌ ప్రశ్నించారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top