నేనంటే కేసీఆర్‌కు భయం  | Sakshi
Sakshi News home page

నేనంటే కేసీఆర్‌కు భయం 

Published Sat, Aug 19 2023 6:33 AM

YS Sharmila comment on KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తనను చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసన తెలపడానికి బయలుదేరిన ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేశారు.ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్న షర్మిలను, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సీఎం కేసీఆర్‌ తొత్తుల్లా పని చేయడం మానుకోవాలన్నారు. తనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు కొనసాగిన ఆమె దీక్షను తీగుల్‌ గ్రామస్తులు వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. షర్మిల నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు 

తొమ్మిదేళ్లుగా గుడిసెల్లోనే..  
ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాను వెళ్లాలనుకున్న తీగుల్‌ గ్రామంలో దళితులు తమ ఇళ్ల ఫొటోలు పంపి, వారి కోసం కొట్లాడాలని వినతి పత్రం పంపించారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపించినా.. తొమ్మిదేళ్లుగా ఈ ప్రజలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారన్నారు. కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లోనే దళిత బంధు ఇంత దరిద్రంగా అమలవుతుంటే ఇతర నియోజకవర్గాల్లో ఎలా అమలవుతుందో ఊహించుకోవచ్చన్నా రు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలుంటే.. ఇప్పటి వరకు 38 వేల కుటుంబాలకే దళిత బంధు అమలైందన్నారు. ప్రతి ఒక్కరికీ దళితబంధు పథకం అమలు చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు.   

 
Advertisement
 
Advertisement