సంతోషమే ‘పూర్తి’ బలం! | World Happiness Index Report Released | Sakshi
Sakshi News home page

సంతోషమే ‘పూర్తి’ బలం!

Feb 12 2023 3:36 AM | Updated on Feb 12 2023 10:23 AM

World Happiness Index Report Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సంతోషమే సగం బలం’ అన్న సామెత ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ప్రస్తుత జీవన పరిస్థితులు, కొత్త అలవాట్లు, కెరీర్‌ సమస్యల నేపథ్యంలో మనిషికి ‘సంతోషమే పూర్తి బలం’ అన్నట్టుగా మారిపోయింది. సంతోషమనేది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన సానుకూల భావన అని.. ఆనందంగా ఉండేవారు మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సంతోషంగా ఉండేవారు తక్కువగా ఒత్తిళ్లకు గురవుతారని.. ఇతరుల కంటే అధిక సృజనాత్మకత కలిగి ఉండటంతోపాటు ఇతరుల పట్ల దాతృత్వాన్ని, ఉదారతను ప్రదర్శిస్తారని వివరిస్తున్నారు. ఇలాంటి వారు తోటివారి నుంచి సామాజికంగా తోడు పొందుతూ.. మంచి ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారని చెప్తున్నారు.

అసలు తాము సంతోషంగా ఉన్నామనే భావనే.. చాలా మందిని తమ జీవితంలో అనేక ప్రయత్నాలు, చొరవ వైపు నెట్టి, విజయం దిశగా నడిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. సమాజంలో లేదా కుటుంబంలో పెద్దల అంచనాలను చేరుకోలేకపోతే అసంతృప్తికి దారితీస్తుందని.. పెద్దగా సమస్యలు లేకపోయినా ఇంకేదో కావాలని కోరుకుంటూ నిరాశ, నిస్పృహలకు గురవుతున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

హ్యాపీనెస్‌కు ఓ ఇండెక్స్‌.. మన పరిస్థితి భిన్నం.. 
గ్లోబల్‌ హ్యాపీనెస్‌ కౌన్సిల్‌ మొదటగా ప్రపంచ దేశాలకు సంబంధించి హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ను రూపొందించింది. 2012 నుంచి దాదాపు 150 దేశాలకు సంబంధించి పలు అంశాల ప్రాతిపదికన ఏటా ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌’ నివేదికను వెలువరిస్తోంది. తలసరి జీడీపీ, సాంఘిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్ధాయిలు, సేవాభావం, దాతృత్వం, ఆరోగ్యకర జీవన అంచనాలు, ఆనందానికి సంబంధించి ఆ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటోంది.

ఈ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో భారత స్కోర్, ర్యాంక్‌ ఏమంత గొప్పగా ఉండటం లేదు. హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌–2022లో మొత్తం 146 దేశాలకుగాను భారత్‌ 136 ర్యాంకు సాధించింది. ఆయా దేశాలకు, ఇండియాకు వర్తించే విషయాల్లో తేడాలు, సారూప్యతలు భిన్నంగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెప్తున్నారు.

అంతేగాకుండా మనదేశంలో సంతోషం–సంపద మధ్య బలహీనమైన సహ సంబంధం (కోరిలేషన్‌) కొరవడటమూ కారణమని ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి జయశ్రీ సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. దేశంలో అసమానతల పెరుగుదల, ధనికులు తమ ఇళ్లలో ఆర్భాటంగా చేసే పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి సామాన్య ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతాయని చెప్పారు. మితిమీరిన పట్టణీకరణ, నగరాలు ఇరుకుగా మారడం, ఆహారభద్రత, ధరల పెరుగుదల వంటివి కూడా దీనిని ప్రభావితం చేస్తాయన్నారు.

సమష్టి ఆనందంతోనే ఉన్నత స్థాయికి.. 
ప్రపంచంలో ఎవరినైనా జీవితంలో ఏది ముఖ్యమని ప్రశ్నిస్తే.. సంతోషంగా ఉండటమేననే సమాధానం వస్తుంది. అందరూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ సంతోషమైనా, ఆనందమైనా ఎలా వస్తుందనేది ముఖ్యం. వ్యక్తిగత స్థాయి కంటే కూడా సమూహ, సమష్టి ఆనందం ఉన్నతస్థాయిలో నిలుపుతుంది. సంతోషం, సంతృప్తి, ఆనందం అనేవాటిని మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విశాల సమాజానికి, వర్గానికి కలిగేలా చేయడం ద్వారా ఒక సార్థకత ఏర్పడుతుంది.

అయితే అపరిమితమైన ఆశలు, ఆశయాలు, నెరవేర్చుకోలేని కోరికలు సరికాదు. జీవితం–చేస్తున్న పని మధ్య తగిన సమతూకం సాధించడమూ ముఖ్యమే. మనకు నచ్చిన ఆహారం తినడం నుంచి నిర్దేశించుకున్న లక్ష్యా­­లు, అంచనాలు చేరుకోవడం వరకు సంతోషానికి మార్గాలు ఎన్నో. ఒక్కొక్కరి అలవాట్లు, పద్ధతులు, ఆలోచనా ధోరణు­లు, పెరిగిన వాతావరణం వంటివాటి ఆధారంగా ఈ మార్గాలు మారుతూ ఉంటాయి. 
– డాక్టర్‌ ఎమ్మెస్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, డైరెక్టర్, ఆశా హాస్పిటల్స్‌  

శారీరక, సామాజిక అవసరాల నుంచి.. 
అమెరికాకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్‌ అబ్రహం మాస్లో 1970 దశకంలో చేసిన సిద్ధాంతీకరణల ప్రకారం.. 
►మనషి జీవితం ప్రధానంగా ఆహారం, నీరు, శృంగారం, నిద్ర వంటి ప్రాథమిక శారీ­­ర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి సంతోషాన్ని ప్రభావితం చేస్తాయి. 
►శారీరక భద్రత, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తుల భద్రత, ప్రేమ, తమదనే భావన, లైంగికపరమైన దగ్గరితనం, ఆత్మగౌరవం, విశ్వాసం, ఇతరులను గౌరవించడం, స్వీయ వాస్తవికత, నైతికత ఆనందాన్ని కలిగిస్తాయి. 
►సామాజికంగా తెలిసిన వారితో స్నేహానుబంధాలు, ప్రేమ, బంధుత్వాల సాధనతోనూ చాలా మంది సంతోషపడి సంతృప్తి చెందుతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement