మానవపాడులో లంకె బిందె.. గుట్టుగా నొక్కేద్దామనుకుని అంతలోనే..

Workers Found Guptha Nidulu Mahabubnagar - Sakshi

ఇంటి పునాది తవ్వుతుండగా బయటపడిన వడ్డాణాలు, నాణేలు

గుట్టుగా బంగారం పంచేసుకున్న కూలీలు 

వాటాల్లో తేడాతో 2 నెలల తరువాత వెలుగులోకి 

ఏడుగురి నుంచి సొత్తు రికవరీ చేసిన పోలీసులు!  

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా కూలీలకు లంకెబిందె దొరికింది. రెండు బంగారు వడ్డాణాలు.. వంద వరకు బంగారు నాణేలు (కిలోన్నరపైగా).. వీటి విలువ రూ.80 లక్షలపైమాటే.. గుట్టుగా నొక్కేద్దామనుకున్నారు కానీ.. పంపకాల్లో తేడా రావడంతో రట్టయింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. మానవపాడులోని ఓ ఇంటి నిర్మాణానికి పునాదితీసే పనిని యజమాని రెండు నెలల క్రితం 11 మంది కూలీలకు అప్పగించాడు. అయితే 9 మంది మాత్రమే పనిలో పాల్గొని మట్టి తవ్వుతుండగా లంకెబిందె బయటపడింది. దానిని యజమానికి తెలియకుండా తరలించిన కూలీలు వంద నాణేలను తొమ్మిది వాటాలు వేసుకున్నారు. రెండు వడ్డాణాలను కరిగించాక పంచుకుందామని అనుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, నందికొట్కూరులలో తెలిసిన బంగారం వర్తకులను సంప్రదించారు. కొందరు ఆభరణాలు చేయించుకుంటే, ఇంకొందరు అమ్మి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు తాకట్టు పెట్టుకున్నారు.  

ఇలా బయటపడింది.. 
తొమ్మిది మంది కూలీలు బంగారాన్ని పంచుకున్నట్లు కూలీల బృందంలోని మిగతా ఇద్దరికీ తెలిసింది. పనికి కుదిరిన వారిలో తామూ ఉన్నాం కాబట్టి వాటా కోసం పట్టుబట్టారు. అందుకు 9 మంది నిరాకరించడంతో వ్యవహారం బట్టబయలైంది. దీనిపై ‘బంగారు నాణేలు లభ్యం?’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం ఏడుగురు కూలీల నుంచి సొత్తు రికవరీ చేసినట్లు తెలిసింది. మిగతా ఇద్దరు తాకట్టు పెట్టారని గుర్తించారు. అయితే, ఘటనను పోలీసులు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. అసలు ఇవి పురాతన నాణేలా?, కావా? అనేది నిర్ధారించేందుకు ఎలాంటి ఆనవాళ్లు లేకుండాపోయాయి. విషయం బయటపడటంతో వాటిని కరిగించిన బంగారం వర్తకులు బెంబేలెత్తుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top