విద్యుత్‌సౌధ అష్టదిగ్బంధనం 

Workers camped on the road in Somajiguda - Sakshi

వేతన సవరణ, ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌ సౌకర్యం, ఆర్టిజన్లకు తగిన ఫిట్‌మెంట్‌ కోసం డిమాండ్‌

సోమాజిగూడలో రోడ్డుపై బైఠాయించిన కార్మికులు

ఖైరతాబాద్, పంజగుట్ట, ఎన్టీఆర్‌మార్గ్‌లలో ట్రాఫిక్‌ జాం  

సాక్షి, హైదరాబాద్‌:  విద్యుత్‌సౌధను ఉద్యోగులు అష్టదిగ్బంధనం చేశారు. వేతన సవరణ, ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం చలో విద్యుత్‌సౌధ కార్యక్రమానికి 24 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌(టీఎస్‌పీఈ జేఏసీ) కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

జేఏసీ పిలుపు మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్టీజన్‌ కార్మి కులు ఉదయం పదిగంటలకే పెద్దసంఖ్యలో సోమాజిగూడలోని విద్యుత్‌సౌధకు చేరుకున్నారు.

అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో తరలిరావడంతో విద్యుత్‌సౌధ ప్రాంగణమంతా నిండిపోయింది. మిగిలినవాళ్లంతా ప్రధాన కార్యాలయం ముందున్న రహదారిపైనే నిలబడాల్సి వచ్చింది. దీంతో ఇటు ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి అటు పంజగుట్ట వరకు రోడ్డంతా విద్యుత్‌ కార్మి కులతో నిండిపోయింది.

ట్రాఫిక్‌ మళ్లింపు.. ఎక్కడి వాహనాలు అక్కడే.. 
విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాతో లక్డీకాపూల్, పంజగుట్ట, ఎన్టీఆర్‌ మార్గ్, సోమాజిగూడ, ఎర్రమంజిల్‌ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి పంజగుట్ట వైపు వెళ్లే రోడ్డుమార్గాన్ని బారికేడ్లతో మూసివేశారు.

అసెంబ్లీ మీదుగా వచ్చి న వాహనాలను రాజ్‌భవన్‌ మీదుగా బేగంపేట వైపు మళ్లించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆందోళనకారులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో రోడ్డుపైకి రావడం, సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్‌రావుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన జేఏసీ నేతలు ధర్నా విజయవంతమైందని చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని ముగించారు. ధర్నా కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.  

మొండివైఖరిపై మండిపడిన జేఏసీ 
ఉద్యోగుల వేతనాలను వెంటనే సవరించాలని, 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్‌ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్‌ నుంచి జీïపీఎస్‌ సదుపాయాన్ని కల్పించాలని, ఆర్టీజన్‌ కార్మి కుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కన్వీనర్‌ రత్నాకర్‌రావు, చైర్మన్‌ సాయిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధర్నావేదికపై నుంచి వీరు కార్మి కులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారి నుంచి కనీసస్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్‌ ఉద్యోగులకు నగదురహిత అన్‌లిమిటెడ్‌ మెడికల్‌ పాలసీని అమలు చేయాలని, రూ.కోటి లైఫ్‌టైమ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ గ్యారంటీని జీపీఎఫ్‌ ఉద్యోగులకు రూ.16 లక్షలు, ఈపీఎఫ్‌ ఉద్యోగులకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్‌ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top