మమ్మీ ఎందుకు మాట్లాడుతలేదు అంకుల్‌..

Woman Pass Away Tragedy In karimnagar - Sakshi

సాక్షి, తంగళ్లపల్లి(కరీంనగర్‌): ‘పోలీస్‌ అంకుల్‌ మా మమ్మీని అప్పటి నుంచి పిలుస్తున్నా పలుకుతలేదు.. ఏమైంది అంకుల్‌’ అంటూ ఆ చిన్నారులు ప్రశ్నించడంతో అక్కడున్నవారు కన్నీ టిపర్యంతమయ్యారు. ఈ ఘటన తంగళ్లపల్లి మండలంలోని రామచంద్రపూర్‌లో శని వారం జరిగింది. గ్రామస్తులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం దినకర్‌–వైష్ణవిలకు దీపాన్స్, హిమాన్స్‌ సంతానం. దినకర్‌ మెడికల్‌ షాపు నిర్వహిస్తుండగా, వైష్ణవి ఇంటి వద్దే ఉంటుంది. బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు వెళ్లి శనివారం వచ్చిన వైష్ణవి(28) బట్టలు ఉతికేందుకు స్నానం గదిలోకి వెళ్లింది.

బట్టలను బకెట్‌లో నానబెట్టి పక్కనే ఆన్‌చేసి ఉన్న హీటర్‌ను ప్లగ్‌ నుంచి వేరుచేసేందుకు ప్రయత్నించగా.. విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. ఎస్సై లక్ష్మారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తమ కూతురు మరణంపై అనుమానం ఉందంటూ వైష్ణవి తల్లిగారు జిల్లెల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎస్సై వారితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదని ఎస్సై తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top