డీజే ప్రవీణ్‌తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య

Wife Killed Husband With Lover In Nalgonda  - Sakshi

నల్గొండ (భువనగిరి) : వివాహేతర సంబంధం బయటపడుతుందని ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఆపై ఇద్దరూ కలిసి మృతదేహాన్ని బ్రిడ్జి పైనుంచి కిందపడేసి ప్రమాదంగా చిత్రీకించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు. మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేటశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా నర్మెట మండలం హన్మంత్‌పూర్‌ గ్రామానికి చెందిన లకావత్‌ కొంరెల్లి తన భార్య లకావత్‌ భారతి అలియాస్‌ సుజాతతో కలిసి జీహెచ్‌ఎంసీలో పనిచేస్తూ సికింద్రాబాద్‌లోని నామలగుండు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. 

వివాహ వేడుకలో పరిచయమై..
రెండేళ్ల క్రితం ఓ వివాహ వేడుకలో డీజే ప్లే చేసే  జనగాం జిల్లా అడవి కేశవపురం గ్రామానికి చెందిన దరావత్‌ ప్రవీణ్‌తో సుజాతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంరెల్లి ఈ నెల 18న సొంతూరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. ఆ వెంటనే సుజాత ప్రియుడు ప్రవీణ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించుకుంది. 

ఇంటికి చేరుకుని దారుణం చూసి..
అయితే, కొంరెల్లి అందరూ నిద్రపోయాయక అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో సుజాతతో ప్రవీణ్‌ సఖ్యతగా మెలుగుతుండడాన్ని చేసి హతాశుడయ్యాడు. ఇదేమిటని భార్యతో గొడవపడ్డాడు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని సుజాత, తన ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి కొంరెల్లి మెడకు చున్నీతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం అదే రోజు రాత్రి కొంరెల్లి మృతదేహాన్ని బైక్‌పై వేసుకుని వరంగల్‌ ప్రధాన రహదారి మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి మండలం అనంతారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి పై నుంచి మృతదేహాన్ని కింద పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో..
కాగా, కొంరెల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు భువనగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘాతుకాన్ని అంగీకరించింది. అనంతరం ప్రవీణ్‌ను కూడా అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద బైక్, చున్నీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో  ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top