
గొంతు నులిమి భర్తను హత్య చేసిన భార్య
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన
నారాయణపేట రూరల్: ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు.. కట్టుకున్న భర్త గొంతునులిమి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేస్తున్నారు.
అక్కడే పనిచేస్తున్న ధన్వాడ మండలానికి చెందిన ఓ యువకుడితో రాధకు పరిచయం ఉండేది. తనకంటే చిన్నవాడైనా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త.. భార్యను మందలించాడు. ఆపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో తాండూరుకు చేరుకున్నాక ఇంటికి వెళితే.. పరువు పోతుందని, వేరేచోట పని చూసుకుందామని రాధ పట్టుబట్టడంతో హైదరాబాద్ వెళ్లారు. బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద పనిచేస్తూ గుడిసెలో ఉంటున్నారు. అయితే రాధ తిరిగి ఆ యువకుడితో మాట్లాడటం అంజిలప్ప గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
హత్యచేసి.. పక్కింట్లో నిద్రించి
ఈ క్రమంలోనే గత నెల 23న రాత్రి అంజిలప్ప మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తా గిన మైకంలో భర్త పడుకొని ఉండగా.. భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఏమీ తెలియ నట్టు పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి భర్త తనను ఇబ్బంది పెడు తున్నాడని చెప్పి అక్కడే పడుకుంది. తెల్లవారుజామున లేచి గుడిసెలోకి వెళ్లి భర్త చనిపోయాడని రోదిస్తూ మృతదేహాన్ని అంబులెన్స్‌లో కోటకొండకు తీసుకొచ్చింది.
కుటుంబ సభ్యుల అనుమానంతో..
మృతుడి సోదరుడు, ఇతర కుటుంబసభ్యులు అంజిలప్ప మృతిపై అనుమానాలు ఉన్నాయని అదేరోజు నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో వారు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిడులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాచుపల్లి పీఎస్‌కు కేసును బదిలీ చేశా రు.
సైబరాబాద్ కమిషనర్, డీసీపీ ఆదేశాలతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. గతనెల 26న కుటుంబసభ్యులను విచారించారు. రాధను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఘటనపై బాచుపల్లి సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే హత్యకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. సీసీ కెమెరాలు పరిశీలిచంగా, హత్య ఘటనలో ఒక్కరే ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని సీఐ చెప్పారు.