పెళ్లి సందడి షురూ! ముహూర్తాలే ముహూర్తాలు!!

Wedding Ceremonys starts auspicious dates For Shubh Muhurat - Sakshi

నేటి నుంచి సెప్టెంబర్‌ 1 వరకు శుభ ముహూర్తాలు  

ఇక మోగనున్న భాజాలు ఒక్కటి కానున్న వేల జంటలు  

కళకళలాడుతున్న బంగారం, వస్త్ర దుకాణాలు  

నిజామాబాద్‌ కల్చరల్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి షురూ కానుంది. శ్రావణ మాసం ప్రారంభమవడంతో పాటు శుభకార్యాల నిర్వహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, శ్రావణమాసం కావడంతో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాకుండా ఏడాదిన్నరగా కరోనా వల్ల అన్నిరంగాలు ఇబ్బందులకు గురయ్యాయి. అనేక వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో కల్యాణ మండపాలు కళ కళ లాడనున్నాయి. 

శుభకరం శ్రావణం.. 
శివకేశవులకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతియేటా ఈ మాసంలో వేల సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈనెల 9 నుంచి శ్రావణం ఆరంభమైంది. పెళ్లీడుకొచ్చిన యువతీయువకులకు వారి తల్లిదండ్రులు వివాహాలు చేసేందుకు ముందుగానే నిశ్చయించుకున్నారు. ఇన్నాళ్లు ము హూర్తాలు లేక వేచిచూశారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండడంతో పెళ్లి భాజాలు మోగనున్నాయి.  

చేతినిండా పని.. 
ఈనెలలో అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఫ్లవర్‌ డెకరేషన్, భజంత్రీలు, వంట మాస్టర్స్, ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. వివాహాలు జరుపుకునేందుకు కల్యాణ మండపాలు, కన్వెన్షన్‌ హాల్స్, సత్రాలు, గదులు ముందుగానే రిజర్వ్‌ చేసుకుంటున్నారు. మార్కెట్‌లో ఇప్పటికే వస్త్రాలు, బంగారం, సరుకుల కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణాల్లోని బంగా రం షాపులు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి.

శుభ ముహూర్త తేదీలు..
ఈనెలలో 12, 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 సెప్టెంబర్‌ 1వ తేదీ ముహూర్తాలు ఉన్నాయి. వీటిల్లో 14వ తేదీ స్వాతీ, 16న అనురాధ, 18న ఏకాదశి, మూల 21న శ్రవణా, 25న ఉత్తరాభద్ర 26న రేవతి నక్షత్రాలు కలిసిన ముహుర్తాలు ఉండటంతో ఆయా తేదీల్లో ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు అభిప్రాయపడుతున్నారు. బాధ్రపద మాసంలో సెప్టెంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 5వరకు శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు చేయరు. తిరిగి అక్టోబర్‌ 7, 8,10 15, 16, 17, 20, 21, 23, 24, 31న ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్‌ (కార్తీక మాసం)లో 6, 10, 12, 13, 17, 20, 21 తేదీలు, డిసెంబర్‌ (మార్గశిరమాసం)లో 5, 8, 9, 10, 12, 17, 18, 19, 24 తేదీల్లో ముహూర్తాలు వివాహానికి అనుకూలంగా ఉన్నాయి.  

వివాహాలకు మంచి రోజులు 
ఈనెల 27వ తేదీ వరకు పలు తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి. కరోనాతో రెండేళ్లుగా శుభకార్యాలు తక్కువగా జరిగాయి. ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్‌ల్లో ముహూర్తాలున్నాయి.  – మురళీకృష్ణ మాచార్యులు, రామాలయ పూజారి, సుభాష్‌నగర్‌

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top