జలమండలి అధికారుల బస్తీ బాట | Water Board Officials Special Drive Began In Jubilee Hills Section | Sakshi
Sakshi News home page

జలమండలి అధికారుల బస్తీ బాట

Feb 20 2022 4:11 AM | Updated on Feb 20 2022 3:11 PM

Water Board Officials Special Drive Began In Jubilee Hills Section - Sakshi

సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా జలమండలి అధికారులు బస్తీబాట పడుతున్నారు. బస్తీలు, కాలనీలనే తేడా లేకుండా క్షేత్ర స్థాయిలో తమ సిబ్బందితో కలిసిపర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. వీలైనంతమేర ఆయాసమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతొ జలమండలి అధికారులు గడయిర 15 రోజులుగా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. రోజుకో బస్తీ, రోజుకోకాలనీ చొప్పున ఆయా సెక్షన్లలోని సిబ్బందితో పాటు మేనేజర్లు, సిబ్బంది అంతా తిరుగుతూ స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్నారు.  

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలినంగర్, తట్టికాన సెక్షన్ల పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌ మొదలైంది. నల్లాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం, డ్రెయినేజీ సమస్యలు, కలుషిత నీటి సరఫరా తదితర సమస్యలను స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయా సెక్షన్లలోని సిబ్బంది అధికారులు ఎంపిక చేసిన బస్తీల్లో నిత్యం పర్యటిస్తూ సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపుతున్నారు. 

కొన్ని అక్కడే.. మరికొన్ని ఉన్నతాధికారుల నివేదనలో... 
స్పెషల్‌ డ్రైవ్‌లో వెలుగుచూస్తున్న కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు జలమండలి జీఎం హరిశంకర్‌ తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని కొన్ని సమస్యలను బస్తీవాసులు, కాలనీవాసులు అధికారులు దృష్టికి తెస్తుంటే వాటికి మాత్రం వెంటనే కాకుండా ప్రతిపాదనలు రూపొందించి వాటికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి పరిష్కరిస్తామంటూ స్థానికులకు హామీ ఇస్తున్నారు.

♦ తట్టికాన సెక్షన్‌ పరిధిలో 15 బస్తీలు, ఫిలింనగర్‌ సెక్షన్‌పరిధిలో 13 బస్తీలు, జూబ్లీహిల్స్‌ సెక్షన్ పరిధిలో రెండు బస్తీలు, బంజారాహిల్స్‌ సెక్షన్‌ పరిధిలో 8 బస్తీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా సెక్షన్ల పరిధిలో నాలుగైదు బస్తీల్లో ఈ పర్యటనలు పూర్తయ్యాయి.  

స్థానికులను కలుపుకొని... 
నిత్యం ప్రజాప్రతినిధులు సమస్యల మీద ఆయా బస్తీలు, కాలనీల్లో తిరుగుతుంటారు. ఈ సారి అధికారులు ఎవరు ఫిర్యాదు చేసినా, చేయకపోయినా నేరుగా సమస్య ఉన్న ప్రాంతాలకే వెళ్లి వారితో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్థానికంగా ఉండే నేతలను వెంటబెట్టుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తిస్తున్నారు.  

♦ ఆయా సెక్షన్లలో పని చేసే మేనేజర్లకు సైతం క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తెలుస్తుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. తద్వారా త్వరితగతిన సమస్యలు పరిష్కారమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. 

పాత పైపుల స్థానంలో... 
చాలా చోట్ల డ్రెయినేజీ పైపులు దెబ్బతినగా మరికొన్ని చోట్ల మ్యాన్‌హోళ్లు లీకవుతున్నాయి. 20 నుంచి 30 సంవత్సరాల క్రితం వేసిన పైపులు అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా వేసినవే. ప్రస్తుతం పరిమితికి మించి వినియోగంలో ఉన్నాయని పలువురు బస్తీవాసులు ఫిర్యాదు చేస్తున్నారు. పాత పైపుల స్థానంలో కొత్తవి వేయాలని అధికారులకు సూచిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement