ఏపీకి 17 ... తెలంగాణకు 37.67 టీఎంసీలు

water allocation in krishna river to telangana and ap - Sakshi

నీటిని కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్ ‌: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 37.672, ఆంధ్రప్రదేశ్‌కు 17 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా చెన్నై తాగునీటి సరఫరా, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు అవసరాల కోసం 9, హంద్రీ–నీవాకు ఎనిమిది టీఎంసీలను ఏపీకి కేటాయించింది. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 7.746, నాగార్జునసాగర్‌ నుంచి ఎడమ కాలువ, ఏఎమ్మార్పీకి 22.186, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు, మిషన్‌ భగీరథకు 7.740 టీఎంసీలను కేటాయించింది. కేటాయించిన నీటి కంటే అదనంగా వినియోగించుకోకుండా ఆయా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లు బాధ్య త తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు బుధ వారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టులో తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీ–నీవాకు 8, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 9 టీఎంసీలు విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు ఏపీ, 37.672 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ లేఖలు రాశాయి.

రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న బోర్డు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో సోమవారం నాటికి కనీస నీటి మట్టానికి ఎగువన 110.440 టీఎంసీలు ఉన్నట్లు లెక్క కట్టింది. వాటిలో ఏపీ, తెలంగాణ ప్రతిపాదించిన మేరకు నీటిని కేటాయించింది. ఇక గతేడాది వినియోగించుకోకుండా మిగిలిపోయిన వాటా నీటిని ఈ ఏడాది విడుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని.. మిగులు నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో కృష్ణా బోర్డు పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top