15 నెలలుగా రాని వేతనాలు.. మేమెలా బతకాలి

Warangal: No Salaries Pmh Outsourcing Employees For 15 Months - Sakshi

సాక్షి,ములుగు: నిత్యావసర ధరలు పెరుగుతుండడంతో రోజువారీగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక నెల వేతనం రాకపోతేనే వేలకు వేలు ప్రభుత్వ వేతనాలను తీసుకుంటున్న ఉద్యోగులు సైతం ఉద్యమాలు చేసి వారి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వం వారికి తలవంచుతుంది. అలాంటిది అరకొర వేతనాలను అందుకుంటున్న పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌(పీఎంహెచ్‌)లో ఔట్‌ సోర్సింగ్‌ కాంటిజెంట్‌ సిబ్బందికి ఏకంగా 15 నెలలుగా వేతనాలు అందటం లేదు.   నిరసనలు తెలి పితే ఫీల్ట్‌ అసిస్టెంట్ల మాదిరిగా ఎక్కడ తమని తొలగిస్తారోఅనే అభద్రతభావంలో ఉండిపోతున్నారు.

15ఏళ్లుగా చేస్తున్న వంట
జిల్లాలోని ఐటీడీఏ ఏటూరునాగారం పరిధిలోని పీఎంహెచ్‌ హాస్టల్స్‌లో 20మంది కాంటిజెంట్‌ వర్కర్లు 15 సంవత్సరాల నుంచి వంటలు చేస్తున్నారు. ఏనాడు వారికి సక్రమంగా వేతనాలు అందిన పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. 2020వ సంవత్సరంలో మూడు నెలలు, 2021లో 10 నెలలు, 2022లో రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో కాంటిజెంట్‌ సిబ్బందికి నెలకు రూ. 10వేల వేతనం అందించడానికి ప్రభుత్వం తరఫున అధికారంగా అనుమతులు వచ్చాయి. కాని అవి కాగితాలకే పరిమితం అయ్యాయని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్కో సిబ్బందికి రూ. 1.50లక్షల వేతనాలు అందాల్సి ఉంది. 

ఎమ్మెల్యేకు విన్నవించుకునేందుకు..
తమకు రావాల్సిన వేతనాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసి విన్నవించుకునేందుకు కాంటిజెంట్‌ వర్కర్లు సిద్ధం అవుతున్నారు. వీలైతే సీతక్కతో  కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లడానికి కార్యచరణ చేస్తున్నారు.

అధికారుల చుట్టూ తిరుగుతున్న సిబ్బంది
వేతనాల చెల్లింపుల విషయంలో కొన్ని నెలలుగా ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని కాంటిజెంట్‌ సిబ్బంది వాపోతున్నా రు.  అడిగిన ప్రతీసారి పైనుంచి నిధులు రాలేదని ఒకరు, వచ్చేంత వరకు వేచి చూడాలని మరొకరు చెబుతున్నారు.. తప్పా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ఉన్నతాధికారిని కలవడానికి వెళితే విద్యార్థులకు వంటలు చేయడం మాని వేతనాల కోసం వచ్చారా అని గద్దిరించారని తెలుస్తుంది. అదే అధికారికి 15 నెలల వేతనం రాకపోతే ఇలాగే స్పందిస్తారా అని సీఐటీ యూ, ఇతర సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. 

నెలవారీగా వేతనాలు ఇవ్వాలి
పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌లో విధులు నిర్వహిస్తున్న కాంటిజెంట్‌ వర్కర్లకు నెల వారీగా వేతనాలు అందించాలి. 15 నెలలుగా వేతనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఐటీడీఏ అధికారులు,  కలెక్టర్‌ను కలిసి వినతులు అందించాం. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో అధికారులు తక్షణం స్పందించి వేతనాలు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి.
– రత్నం రాజేందర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

రెండు, మూడు రోజుల్లో అందజేస్తాం
పీఎంహెచ్‌ హాస్టల్స్‌లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న కాంటిజెంట్‌ వర్కర్లకు వేతనాలు రావడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. రెండు, మూడు రోజుల్లో వేతనాలు అందజేస్తాం. వర్కర్లు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
 – దేశిరాం, ఐటీడబ్ల్యూఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top