పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు! | Warangal man planted Banyan Tree for Birds in Graveyard | Sakshi
Sakshi News home page

పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు!

Apr 8 2026 2:32 PM | Updated on Apr 8 2026 2:57 PM

Warangal man planted Banyan Tree for Birds in Graveyard

సాధారణంగా మనిషి చనిపోయి అంత్యక్రియలు ముగిసిన తర్వాత బంధువులు 3, 5, 10 రోజుల్లో మృతి చెందిన వారికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసి పిట్టకు పెట్టడం ఆనవాయితీ. అయితే ఓ గ్రామంలోని శ్మశానవాటికలో చెట్లు లేక పిట్టలు రాక వాటిని ముట్టడం లేదు. దీంతో ఓ వ్యక్తి స్వయంగా ఓ చెట్టు నాటాడు. అది పెద్ద వృక్షంగా మారి పిట్టలు, కాకులకు ఆవాసంగా మారడంతో వెంటనే పిట్ట ముడుతోంది. వరంగల్‌ జిల్లా గీసుకొండలో పదేళ్ల కిందట మృతిచెందిన వారికి పిట్టకు పెట్టడానికి వెళితే శ్మశానవాటిక వద్ద చెట్లు లేకపోవడంతో కాకులు, ఇతర పక్షులు వచ్చేవి కావు.

పరిస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన వీరగోని రాజ్‌కుమార్‌ (ప్రస్తుతం గ్రామ సర్పంచ్‌) 2015లో మర్రిచెట్టును నాటాడు. ఆ తర్వాత అది పెరిగి పెద్దదయ్యే వరకు నీరు పోయిస్తూ వచ్చాడు. దీంతో ఆ మొక్క పెద్ద వృక్షంగా మారి ఊడలు దిగింది. ఆ వృక్షంపై కాకులు, ఇతర పిట్టలు వాలి మృతుల కుటుంబాల వారు పెట్టే ఆహార పదార్థాలను పిట్ట తింటుండటం (ముట్టడం)తో వారు సంతృప్తి చెందుతున్నారు.

మంగళవారం తమ కులపెద్ద పొగాకు కిష్టయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో శ్మశానవాటిక వద్దకు వెళ్లిన రాజ్‌కుమార్‌ తాను పెంచి పెద్ద చేసిన మర్రి చెట్టును ఆప్యాయంగా హత్తుకొని సంతోషం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement