మూడో వేవ్‌పై అప్రమత్తత అవసరం

Vigilance Needed To Avoid Third Wave - Sakshi

నాగార్జునసాగర్‌/ మిర్యాలగూడ/ నకిరేకల్‌: కరోనా మూడో వేవ్‌పై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్‌లలో నిర్వహించిన సమావేశాల్లో వైద్య సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాల్లో టెస్టింగ్‌ క్యాంపులు ఏర్పాటుచేయాలని, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధానంగా వివాçహాలు, జాతరలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 

సీజనల్‌ వ్యాధులపైనా నజర్‌ 

ఆదివారం జిల్లాల్లో పర్యటించిన ఉన్నత స్థాయి బృందం పలు కీలక సూచనలు చేసింది. జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా ఫీవర్‌ సర్వేకు సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ అంశాలివీ.. 

నాలుగో విడత ఫీవర్‌ సర్వేను పటిష్టంగా నిర్వహించాలి. విద్య, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని కొనసాగించాలి. 

కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్‌ కిట్లు అందించాలి. 

కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాల్లో వైద్య సేవలు అందించాలి. వారు అంతకుముందు మూడు నాలుగు రోజుల్లో ఎవరిని కలిశారో గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయాలి. 

సరిహద్దు జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కరోనా వైరస్‌ సోకకుండా గట్టి నిఘా పెంచాలి. మండల, జిల్లా స్థాయి బృందాలు ఆ దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలి.  

జిల్లాల్లో టెస్టుల సంఖ్య పెంచాలి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి. ప్రతి పీహెచ్‌సీలో  మందులను అందుబాటులో ఉంచాలి.  

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్, అంటువ్యాధులు, దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాపించే జబ్బులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. 

జిల్లా వైద్యాధికారులు, ఏరియా ఆస్పత్రుల పర్యవేక్షకులు, సర్వే అధికారులు రోజూ సమస్యలపై విశ్లేషించుకొని చర్యలు చేపట్టాలి. 
 
పీహెచ్‌సీల వారీగా వైద్యాధికారులు ఫీవర్‌ సర్వేలో తప్పక పాల్గొనాలి. ముఖ్యంగా గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలి. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. 

వైద్యాధికారులు, డాక్టర్లు విధుల్లో తప్పక ఉండాలి. సెలవులు పెట్టకూడదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top