భారతీయ భాషలతోనే పరిపాలన 

Vice President Venkaiah Naidu At Telugu University Foundation Day Celebrations - Sakshi

ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రాంతీయ భాషల్లోనే.. 

తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌/నాంపల్లి: పరిపాలన భాషగా భారతీయ భాషలే ఉండాలని, మాతృ భాషే ఏ రాష్ట్రానికైనా పాలన భాష కావాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రాంతీయ భాషల్లోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వలస పాలకులు మన భాషపై ముందుగా దాడి చేశారని, వారి భాషలను బలవంతంగా మనపై రుద్దారన్నారు.

భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను అర్థం చేసుకుని ఉమ్మడిగా జీవించడమే నిజమైన విద్యని పేర్కొన్నారు. ప్రపంచీకరణ ఎల్లలు చెరిపేసిన మనిషి తన గతాన్ని, పెరిగిన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకూడదన్నారు. ఆంగ్ల భాష మోజులో తెలుగును చులకన చేయొద్దని హితవు పలికారు. తనతో సహా దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారంతా తెలుగులోనే చదువుకున్నారని తెలిపారు.

తెలుగు భాషాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేసిన కృషిని శ్లాఘించారు. ఈ యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని కోరారు. సాంకేతిక పదాలకు సమానమైన తెలుగు అర్థాలతో నిఘంటువు తీసుకురావాలన్నారు.

కొత్త విద్యా విధానం ప్రాంతీయ భాషలోనే ఉన్నత విద్య చదివే అవకాశం కల్పిస్తోందన్నారు. అనంతరం తెలుగువాణి పత్రికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రి మహ్మద్‌ అలీ, యూనివర్సిటీ వీసీ ఆచార్య కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

పురస్కారాల ప్రదానం 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యకు (2018వ సంవత్సరానికి), ప్రముఖ నృత్య కళాకారుడు కళాకృష్ణకు (2019వ సంవత్సరానికి) విశిష్ట పురస్కారాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. 

ఏక్‌ భారత్‌–శ్రేష్ఠ భారత్‌ ఛాయా చిత్ర ప్రదర్శన  
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో ఏర్పాటు చేసిన ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’(ఈబీఎస్‌బీ)పై నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రారంభించారు.

ఈబీఎస్‌బీ కింద జత చేసిన హరియాణా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడల విశిష్టతను తెలియజేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఛాయాచిత్ర ప్రదర్శన ఈ నెల 12 నుంచి 14 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top