
(కరీంనగర్) గుండెల్లో దాచుకున్న ప్రేమ, మాటల్లో చెప్పలేని భావాలను వెల్లడించే ప్రేమికుల రోజు రానే వచ్చింది. జాతి, కుల, మత, వర్గ, భాష, ప్రాంతీయ భేదాల్లేనిది ప్రేమ. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అది ఎలా పుట్టింది.. దాన్ని పండుగలా జరుపుకోడానికి కారణాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
వాలెంటైన్స్ డే నేపథ్యం..
ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు వాలెంటైన్. రోమ్‌కు చెందిన ఆయన క్రీస్తుపూర్వం 270లో యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేశాడు. దీనివల్ల యువత వాలెంటైన్‌ను ఆరాధించేవారు. అదే సమయంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ కుమార్తె ఆయనకు అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి, తప్పుదోవ పట్టిస్తున్నాడన్న కారణం చూపి, వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి, ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఇది జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ చనిపోయిన రోజును ప్రేమికుల దినోత్సవంగా ప్రకటించారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికులు పండుగలా జరుపుకుంటున్నారు.
ప్రేమను వ్యక్తపరిచే రోజు
ప్రేమికుల రోజున ప్రేమికులు తమ అనుబంధాన్ని పెంచుకునేందుకు గులాబీలు అందించి, ప్రపోజ్ చేసుకుంటారు. గిఫ్టుగా చాకెట్లు, టెడ్డీబేర్‌లు ఇస్తారు. ప్రామిస్ చేసి, తమ ప్రేమను ముద్దు ద్వారా తెలియజేస్తారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
థాయిలాండ్ అమ్మాయి, మల్యాల అబ్బాయి
నా పేరు గసిగంటి హరీశ్. మాది మల్యాల. షార్జాలోని ఓ కంపెనీలో స్టోర్ కీపర్‌గా పని చేస్తున్న. ఇదే కంపెనీలో పని చేస్తున్న «థాయిలాండ్‌కు చెందిన కవిన్నాట్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మా కుటుంబాల వారు ఒప్పుకోవడంతో స్వగ్రామం వచ్చి, ఈ నెల 10న వివాహం చేసుకున్నాం. నెల తర్వాత థాయిలాండ్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం.
– గసికంటి హరీశ్–కవిన్నాట్, మల్యాల
మతం అడ్డొచ్చినా మనసులు కలిశాయి
2008లో తనే ముందుగా నన్ను ఇష్టపడింది. తర్వాత నేనూ ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ మతం అడ్డు వచ్చింది. నేహ కుటుంబసభ్యులు చాలా గొడవ చేశారు. కానీ మా మనసులు కలవడంతో చివరికి ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. అమ్మానాన్న ఆమెను కూతురిలా చూసుకుంటారు. నలుగురు పిల్లలతో హాయిగా ఉంటున్నాం.
– మహమ్మద్ మోయిజ్–నేహ, సిరిసిల్ల
2009లో వివాహం చేసుకున్న
2009లో జ్యోత్స్నను ప్రేమ వివాహం చేసుకున్న. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న. మాకు ఇద్దరు కుమారులు. మా తమ్ముడు ప్రదీప్‌కుమార్ కేరళ రాష్ట్రానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అమ్మానాన్న, అత్తామామలు అందరం కలిసిమెలిసి ఉంటున్నాం.
– గోలివాడ ప్రవీణ్‌కుమార్–జ్యోత్స్న, ఎన్టీపీసీ రామగుండం
ఆనందంగా జీవిస్తున్నాం
ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీకి చెందిన నాకు దీపిక పరిచయమైంది. మేము 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాం. మాకు పాప సౌఖ్య, బాబు హవీష్‌లు ఉన్నారు. మా ఆవిడ వాళ్ల సోదరి జ్యోత్స్న కూడా ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నా. కుటుంబసభ్యులందరం కలిసి ఆనందంగా జీవిస్తున్నాం.
– సామల శ్రీనివాస్–దీపిక, మేడిపల్లి రోడ్, రామగుండం
ముందుగా నేనే ప్రపోజ్ చేశా
విజయవాడ ప్రభుత్వ దంత వైద్యశాలలో బీడీఎస్ కోర్సులో చేరాను. అక్కడే జ్యోతి క్లాస్‌మేట్‌గా పరిచయమైంది. ముందుగా నేనే ప్రపోజ్ చేశాను. 10 రోజులు ఆలోచించుకున్నాక అంగీకారం తెలిపింది. కోర్సు పూర్తయిన మూడేళ్లకి పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం ఆమె దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా, నేను సిరిసిల్ల టౌన్‌లో ప్రైవేట్ డెంటిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా.
– డాక్టర్ దోర్నాల శ్యాంసుందర్–జ్యోతి, దంత వైద్యులు, సిరిసిల్ల
ప్రేమికులుగా కారు గెలిచాం
మాది ఖమ్మం జిల్లా ఇల్లెందు. లావణ్యది గోదావరిఖని. సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘సెవెన్ వెడ్డింగ్ వోవ్స్’ కాంపిటీషన్‌లో ప్రేమికులుగా ఫస్ట్ ఫ్రైజ్‌లో విలువైన కారు గెలిచాం. 2012 నవంబర్ 29న పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు.
– డాక్టర్ మహేందర్(సుల్తానాబాద్ మెడికల్ ఆఫీసర్)– డాక్టర్ లావణ్య (ఓదెల ప్రభుత్వ ఆస్పత్రి), గోదావరిఖని
తొలిప్రేమ.. తొమ్మిదేళ్లకు పెళ్లి
మాది కరీంనగర్‌లోని మంకమ్మతోట. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతుండగా 2013 అక్టోబర్ 2న కలుసుకున్నాం. తొలిచూపులోనే ప్రేమ మొదలైంది. కానీ లైఫ్‌లో సెట్ అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదని ప్రామిస్ చేసుకున్నాం. ప్రస్తుతం ఇద్దరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం. 2021 డిసెంబర్‌లో ఇంట్లో వాళ్లకి చెప్పాం. అందరూ ఒప్పుకోవడంతో ఈ నెల 10న హైదరాబాద్‌లో మా పెళ్లి జరిగింది.
– కట్ల హర్షిత్–భగవతి, కరీంనగర్
పోలీసుల సమక్షంలో ఒక్కటయ్యాం
అప్పట్లో మాకో పుస్తకాల షాపు ఉండేది. అక్కడికి విద్యార్థులు చాలామంది వచ్చేవారు. వారిలో విద్య ఒకరు. నేను ప్రేమిస్తున్న విషయాన్ని ఆమెతో «ధైర్యంగా చెప్పా. కానీ విద్య పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటి కలెక్టర్ సుబ్బారావు, ఎంపీ చొక్కారావులను సంప్రదించాను. పోలీసుల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యాం. 32 ఏళ్లవుతున్నా అరమరికలు లేకుండా జీవిస్తున్నాం.
– సంగీతం సత్యనారాయణ–విద్య, గ్రెస్ పట్టణ అధ్యక్షుడు, సిరిసిల్ల