యూఓహెచ్‌‌ ఘనత.. మరింత చౌకగా ఫావిపిరవిర్‌

UOH Startup Develops New Method To Produce Favipiravir At Less Cost - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్(యూఓహెచ్‌)‌లోని ఆస్పైర్‌ టీబీఐలో ఏర్పాటైన స్టార్టప్‌ కంపెనీ ఆప్టస్‌ థెరప్యూటిక్స్‌ కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్న మందు ఫావిపిరవిర్‌ను మరింత చౌకగా ఉత్పత్తి చేసేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించింది. కృత్రిమ రసాయన శాస్త్రం, కెమో ఎంజమాటిక్‌ రసాయన శాస్త్రాలపై పరిశోధనలు చేసే ఆప్టస్‌ థెరప్యూటిక్స్‌ ఫావిపిరవిర్‌తోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగించే ఓ మందును కూడా మరింత సమర్థంగా, చౌకగా, పర్యావరణ అనుకూల మార్గాల్లో ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ పద్ధతి ద్వారా ఫావిపిరవిర్‌ను కావాల్సినంత మోతాదులో సులువుగా తయారు చేసుకొనే అవకాశం ఏర్పడటం గమనార్హం. ఈ పద్ధతిలో తక్కువ రసాయనాలను వాడటం, కావాల్సిన అణువులను సులువుగా వేరు చేసే అవకాశం ఉండటం దీనికి కారణం. (33 రూపాయలకే కరోనా ట్యాబ్లెట్‌)

హైదరాబాద్‌లోని ఫ్లెమింగ్‌ లేబొరేటరీస్‌ సహకారంతో వాణిజ్యస్థాయి ఉత్పత్తిపై కూడా ప్రయోగాలు పూర్తి చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఫావిపిరవిర్‌ను భారీగా సరఫరా చేసేందుకు ఫ్లెమింగ్‌ లేబొరేటరీస్‌ ఇప్పటికే ఓ రష్యా కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పొదిలి అప్పారావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన ఆప్టస్‌ లేబొరేటరీస్‌ సాధించిన ఘనతను కొనియాడారు. వర్సిటీకి ఇదో చరిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్టస్‌ లేబొరేటరీస్‌కు చెందిన డాక్టర్‌ కోటిరెడ్డి, ఫ్లెమింగ్‌ లేబొరేటరీస్‌కు చెందిన డాక్టర్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top