హోంగార్డులు.. ఎన్ని పాట్లు!

Unpaid salaries to home guards - Sakshi

ఇంకా అందని సెప్టెంబర్ నెల జీతాలు 

కొన్ని నెలలుగా ఆలస్యమవుతున్న వైనం 

కనీస అవసరాలకూ ఇబ్బందే అంటున్న హోంగార్డులు  

ఆధునీకరణ పట్టించుకోని అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌:  రాజధానిలో పని చేస్తున్న హోంగార్డులకు సెప్టెంబర్ నెల గౌరవ వేతనం ఆదివారానికీ అందలేదు. ప్రతి నెలా ఒకటి–రెండు తారీఖుల్లో వచ్చే జీతం కొన్ని నెలలుగా ఆలస్యం అవుతోంది. ఈసారి 8వ తేదీ వచ్చినా ఇప్పటికీ అందకపోవడంతో ఈ చిరుద్యోగులు బ్యాంక్‌ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమ సిబిల్‌ స్కోరు దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. రాజధానిలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసుల సంఖ్యకు సమానంగా హోంగార్డులు ఉన్నారు. పోలీసుస్టేషన్ల వారీగా హోంగార్డ్స్‌ జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు ప్రతి నెలా హోంగార్డ్స్‌ కమాండెంట్‌ కార్యాలయానికి చేరుతాయి. ఈ బిల్లుల తయారీ మొత్తం ఇప్పటికీ మాన్యువల్‌గానే జరుగుతోంది.

ఆ మధ్యన కొన్నాళ్ళు బయోమెట్రిక్‌ వ్యవస్థ ప్రవేశపెట్టినా.. అనివార్య కారణాలతో తొలగించారు. హోంగార్డులు పని చేసే ఠాణాలు, కార్యాలయాల్లో ఉండే అటెండెన్స్‌ రిజిస్టర్లలో సంతకాలతోనే ప్రస్తుతం వీరి హాజరు గణిస్తున్నారు. ప్రతి నెలా 20వ తేదీ నుంచి మరుసటి నెల్లో 19వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు దీనికి సంబంధించి హాజరుపట్టీ తయారు చేస్తుంటారు. పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ఇతర కార్యాలయాల నుంచి నుంచి హెడ్‌–క్వార్టర్స్‌ లేదా అడ్మిన్‌ అధికారులకు వెళ్లే ఈ హాజరు ఫైల్‌ అక్కడ అప్రూవ్‌ అయ్యాక మాత్రమే హోంగార్డ్స్‌ కమాండెంట్‌ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి సంబంధిత కమిషనర్‌ ఆఫీస్‌కు వచ్చిన తర్వాతే జీతాలు లెక్కించి బ్యాంకు ద్వారా హోంగార్డుల ఖాతాలో పడాల్సి ఉంది.

గతంలో ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణించే వాళ్ళు. మాన్యువల్‌గా జరుగుతున్న పనుల కారణంగా కొన్నేళ్ళ క్రితం వరకు జీతాల చెల్లింపు ఆలస్యమై ప్రతినెలా 15వ తేదీ తరవాతే హోంగార్డులకు అందేవి. అయితే దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు నెల లెక్కింపును 20 నుంచి 19వ తేదీ వరకు మార్చారు. అయినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా కాస్త ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయని హోంగార్డ్స్‌ వాపోతున్నారు. ఈ విభాగంలో గడిచిన కొన్నేళ్ళలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. వీటికి చెక్‌ చెప్పడంతో పాటు హోంగార్డులకూ ప్రతి నెలా ఒకటి–రెండు తేదీల్లో జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టట్లేదు.

గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలన్నీ హోంగార్డుల ‘హాజరు’ ఆధారంగా జరిగినవే. హోంగార్డుల హాజరును నమోదు చేయడానికి పోలీసుస్టేషన్ల వారీగా మరోసారి బయోమెట్రిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి, లోపాలకు అధిగమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభకోణాలకు  ఆస్కారం లేకుండా పోవడంతో పాటు జీతాల బిల్లుల తయారీ పేపర్‌తో పని లేకుండా వేగంగా జరుగుతుంది. ఈ బయోమెట్రిక్‌ సర్వర్‌ కమాండెంట్‌ కార్యాలయంలో ఉంచితే... హాజ రు అక్కడే నమోదు అవుతుంది. ఫలితంగా కచ్చితత్వం ఉండటంతో పాటు జీతా ల బిల్లులు సైతం ఆలస్యం కావు.  కేవలం పర్మిషన్లు, ఆన్‌డ్యూటీల్లో ఉన్న హోంగార్డుల వివరాలను మాత్రం ఈ కార్యాలయానికి మాన్యువల్‌గా, నేరుగా పంపితే సరిపోతుంది.

ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం పోలీసుశాఖలో ‘బడుగు జీవులు’ అయిన హోంగార్డులే. తమకు గృహరుణాలు, ఇతర లోన్లు ఉన్నాయని, వీటి ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలోనే కట్‌ అ వుతాయని చెప్తున్నారు. జీతాల ఆలస్యం కారణంగా ఇది సాధ్యంకాక తమ సిబిల్‌ స్కోర్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమ బాధలు తీర్చాలని హోంగార్డులు వేడుకోంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top