
ఏపీ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో కీలక నిర్ణయం
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్ర పర్యావరణశాఖ సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) మంజూరు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను తిరస్కరించింది.
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ గురువారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర అంశాలపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జల సంఘం పరిశీలించాలని నిపుణుల కమిటీకి సూచించింది.
ఈ ఏడాది జూన్ 17న సమావేశమైన కమిటీ.. ప్రాజెక్టు ప్రతిపాదనను తిరిగి పంపించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం ముందుగా కేంద్ర జల సంఘాన్ని సంప్రదించి అవసరమైన అనుమతులు, క్లియరెన్సులతోపాటు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) పొందాలని సూచించింది. ఆ తర్వాతే టీఓఆర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.