
భారతీయ యువతను వణికిస్తున్న నిరుద్యోగ గణాంకాలు
వేగంగా ఊడిపోతున్న ఉద్యోగాలు.. వారానికి 8 వేల మంది రోడ్ల మీదికి..
లేబర్ వర్క్‌ను మింగేస్తున్న యాంత్రీకరణ
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఐటీలో మంటలు
కుచించుకుపోతున్న సర్వీస్ సెక్టార్.. భారతీయ విద్యార్థులు అతలాకుతలం
అమెరికా రావొద్దంటూ భారత్‌లోని మిత్రులకు ఫోన్లు
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు వెళ్లాలంటేనే భారతీయులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు యువతను మరీ భయపెడుతున్నాయి. ‘అక్కడ పరిస్థితి ఏమిటి?’ అని ప్రవాస భారతీయులకు ఫోన్ చేస్తే ముందుగా వచ్చే మాట ఒక్కటే.. ‘వద్దు బ్రో.. ఇప్పుడు అమెరికాకు రావొద్దు’. గ్రీన్‌కార్డు ఉన్న వాళ్ల నుంచీ ఇదే మాట వినిపిస్తోంది.
పెరుగుతున్న ఖర్చులు, పడిపోతున్న ఆదాయం, వెంటాడుతున్న అప్పులు.. ఇదీ పరిస్థితి అంటున్నారు అమెరికాలోని మనవాళ్లు. కేవలం ఆరు నెలల కాలంలోనే లేబర్ మార్కెట్ నేలబారుకు చేరిందని చెబుతున్నారు. ఐటీ సెక్టార్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం వెళ్లిన విద్యార్థులను ఈ పరిస్థితులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొత్తగా యూఎస్ వెళ్లాలనుకునే వాళ్లు పునరాలోచించాల్సి వస్తోంది.
ఆగస్టులో దారుణ పరిస్థితి
అమెరికాలో నిరుద్యోగ గణాంకాలను అక్కడి అధికారిక సంస్థ బ్యూరో ఆఫ్ లేబర్ వెల్లడిస్తుంది. జూలై 19వ తేదీ నాటికి అమెరికాలో నిరుద్యోగ జాబితాలో 2.21 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆగస్టు 30 నాటికి ఈ సంఖ్య 23.7 లక్షలకు పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య సగటున వారానికి 8 వేల చొప్పున పెరుగుతోందని బీఎస్‌ఎస్ తెలిపింది. గడచిన ఆరు వారాల్లో ఐటీ సెక్టార్‌లోనే దాదాపు 5.8 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
ఈ రంగం కొత్తగా సృష్టించిన ఉద్యోగాలు 50,200 మాత్రమే. ముఖ్యంగా ఆగస్టు నెలలో 1.8 లక్షల ఉద్యోగాలు ఊడిపోయినట్టు జాబ్‌లెస్ డేటా పేర్కొంది. యూఎస్ జాబ్ మార్కెట్‌లో ఈ పరిస్థితి ఐదేళ్ల క్రితం కూడా లేదని చెబుతున్నారు. ఐటీ ఉద్యోగాల సృష్టి తప్ప, కుదించడం తక్కువేనని.. అది కూడా కొత్త టెక్నాలజీతో మార్పు చేసినట్టు అక్కడి మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
లేబర్ మార్కెట్ డౌన్
అమెరికా కొన్ని దేశాలకు లేబర్ వీసాలు జారీచేస్తుంది. మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, డెలివరీ విభాగం తదితర చోట్ల శారీరక శ్రమ చేసే కొన్ని రకాల పనులను క్లాస్–4గా విభజించారు. ఈ పనులు చేసేందుకు భారతీయులకు అనుమతి లేదు. లేబర్ వీసాలో భారతీయులను మినహాయించారు. అయితే, మెజారిటీ భారతీయ విద్యార్థులు చదువుకుంటూనే ఇలాంటి పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తుంటారు. ట్రంప్ వచ్చిన తర్వాత లేబర్ మార్కెట్‌పై ఆంక్షలు ఎక్కువయ్యాయి.
పార్ట్‌టైం ఉద్యోగాలు చేసే వారిపై నిఘా పెట్టి, వారి డేటాను సేకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ పనులు చేసేందుకు భయపడుతున్నారు. ఫలితంగా చాలా రెస్టారెంట్లు పూర్తిస్థాయిలో నడవడం లేదని లేబర్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా రెస్టారెంట్లు, డెలివరీ, మాల్స్‌లో రోబోటిక్ సర్వీస్ విధానాలను తీసుకొస్తున్నారు. పూర్తి యాంత్రీకరణ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలు వెళ్లాయి. ఫలితంగా లేబర్ పనులకు అవకాశం ఉన్న వారికీ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.
ఐటీ అతలాకుతలం
ఐటీ రంగం పూర్తిగా సర్వీస్ సెక్టార్‌పైనే ఆధారపడింది. అమెరికన్ కంపెనీలు భారత్‌లో ఉండే ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అమెరికాలో ఎక్కువ వేతనం ఇచ్చేకన్నా, భారత్‌లో తక్కువ వేతనంతో రిమోట్ పని విధానం చేయించుకోవచ్చని భావిస్తున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఐటీ సెక్టార్‌పై ప్రభావం చూపుతోంది.
బిగ్ డేటా సెంటర్స్ ఆవిర్భావం, ప్రత్యేక కోడింగ్ విధానం ఐటీకి సొంతమైంది. ఫలితంగా సాధారణ కోడింగ్‌తో ఉండే ఉద్యోగాల అవసరం తగ్గుతోంది. ఇదే క్రమంలో ట్రంప్ టారిఫ్‌ల భారం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఐటీ రంగంపై భారీగా టారిఫ్‌లు విధించవచ్చనే వార్తలతో ఐటీ సెక్టార్ కొత్త ఉద్యోగ నియామకాలు నిలిపివేసింది. ఏఐ టెక్నాలజీతో అనుసంధానం కాని ఉద్యోగులను తగ్గిస్తున్నాయి.
టారిఫ్‌లు విధిస్తే ఇండియాలో పనిచేసే ఉద్యోగి వేతనం, ఇంచుమించు అమెరికాలో ఉద్యోగి వేతనంతో సమానం (ఉద్యోగికి ఇచ్చేది కాదు... టారిఫ్‌లు కలుపుకుని) అవుతుంది. ఫలితంగా కంపెనీలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడ్ రేట్లపై ఐటీ కంపెనీలు ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాయి. సానుకూల నిర్ణయాలు ఉంటే తప్ప ఐటీ బతకడం కష్టమని ప్రవాస భారతీయలు అంటున్నారు.
ఇది కరెక్ట్ సీజన్ కాదు
నాకు గ్రీన్ కార్డ్ ఉంది. ఐటీ సంస్థలో పనిచేస్తున్నా. టారిఫ్‌ల ఫలితంగా లేఆఫ్ ఇచ్చారు. యూఎస్ నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డు ఉన్నవాళ్లకు ఆరు నెలలు నిరుద్యోగ భృతి ఇస్తారు. జాబ్‌లెస్ డేటాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా జాబ్‌లు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొత్తవాళ్లు అమెరికాకు రావొద్దు.
– కమలాకర్ బుర్రా, అమెరికాలో ఐటీ ఉద్యోగి.
యాంత్రీకరణే శరణ్యం
రెస్టారెంట్‌లో భారతీయ విద్యార్థులు పనిచేసినంత కాలం సమస్య ఉండేది కాదు. అనధికారమే కావచ్చు కానీ వాళ్లకు ఆర్థికంగా చేయూత ఉండేది. ట్రంప్ వచ్చిన తర్వాత విద్యార్థులు పనిచేయడం లేదు. అమెరికాలో అధికారిక లేబర్ వీసా ఉన్నవాళ్ల కోరికలు మేం తీర్చలేం. దీంతో రోబోటిక్ వైపు వెళ్తున్నాం. భవిష్యత్‌లో లేబర్ మార్కెట్ స్వరూపం పూర్తిగా మారుతుంది.
– పల్లెల మున్షీనాథ్, డల్లాస్‌లో ఓ రెస్టారెంట్ యజమాని.