
హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లకు కుట్ర..ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
విజయనగరంలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు అదుపులోకి..
తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్,ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్
పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు కెమికల్స్ కొన్ననిందితులు
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్‌వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్‌ను విజయనగరం తరలించారు.
డమ్మీ బ్లాస్ట్‌లకు కుట్ర
విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్‌ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్‌కు సమాచారం అందింది.
దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్‌లో చదువుకున్నప్పుడే...
సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్‌తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్‌తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.