సంక్రాంతికి 4,981 స్పెషల్‌ బస్సులు  | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి 4,981 స్పెషల్‌ బస్సులు 

Published Sat, Jan 2 2021 8:18 PM

TSRTC Special Buses For Sankranthi Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 4,981 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ బస్సులను మహాత్మా గాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్, సీబీఎస్, ఉప్పల్, లింగంపల్లి, ఎల్‌బీనగర్, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, టెలిఫోన్‌ భవన్‌ తదితర ప్రాంతాల నుంచి నడపనున్నట్లు తెలిపారు.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుడివాడ, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. కరీంనగర్‌ వైపు వెళ్లే బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి, వరంగల్‌ వైపు వెళ్లే వాటిని ఉప్పల్‌ నుంచి నడపనున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్‌బీ నగర్‌ నుంచి, కర్నూల్, మహబూబ్‌నగర్‌ వైపు వెళ్లే బస్సులు గౌలిగూడ సీబీఎస్‌ నుంచి బయలుదేరుతాయి. మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ వైపు వెళ్లే వాటిని దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నడుపుతారు. ఎంజీబీఎస్‌లోని 35, 36 ప్లాట్‌ఫామ్‌ల నుంచి విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాకపోకలు సాగిస్తాయి. టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ నుంచి సీట్లు రిజర్వ్‌ చేసుకోవచ్చు. వివరాలకు 9959226245, 9959224910 నంబర్లలో సంప్రదించవచ్చు. 

Advertisement
Advertisement