TSRTC Introduced AC Electric Buses in Vijayawada Route - Sakshi
Sakshi News home page

వీడియో: టీఎస్‌ఆర్టీసీలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సు చూశారా? విజయవాడ రూట్‌లోనే తొలి దఫా

Apr 17 2023 9:06 PM | Updated on Apr 17 2023 9:22 PM

TSRTC Introduced AC Electric Buses See How Cool They - Sakshi

త్వరలో తెలంగాణ ఆర్టీసీ ఈ-బస్సులను రోడ్డెక్కించేందుకు రెడీ అయ్యింది.  

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ హితం దిశగా టీఎస్‌ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ-బస్సులను రోడ్డెక్కించనుంది.  వచ్చే నెల నుంచి ఈ ఏసీ  ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అదీ విజయవాడ(ఆంధ్రప్రదేశ్‌) రూట్‌లో కావడం గమనార్హం.

వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వాడకంలోకి తీసుకురాబోతుంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును సజ్జనార్ పరిశీలించారు.

బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు. వచ్చే నెలలోనే కొన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు వినోద్‌ కుమార్‌, మునిశేఖర్‌, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్‌తో పాటు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ఏజీఎంలు వేణుగోపాల్‌ రావు, ఆనంద్‌ బసోలి, తదితరులు పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే!

12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంది.

► ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

► బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది.

► ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది.

► ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది.

► బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది.

► బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి.

► అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది.

► ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది.

పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్‌ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పనుంది. ఇవి కాకుండా అశోక్ లేలాండ్, జీబీఎం సంస్థల నుంచి కూడా మరో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను ఆయా సంస్థలు టీఎస్‌ఆర్టీసీకి అందజేయనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement