TSRTC: లక్ష దాటిన రాములోరి తలంబ్రాల బుకింగ్‌లు

TSRTC Extends Bhadachalam Sita Rama Talambralu Booking Dates - Sakshi

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్‌ వస్తోంది. ఇప్పటివరకు లక్షకి పైగా మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఆదివారం నుంచే ఈ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. భక్తుల డిమాండ్‌ దృష్ట్యా తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు సంస్థ పొడిగించింది. బుక్‌ చేసుకున్న భక్తులకు రెండు మూడు రోజుల్లోనే తలంబ్రాలను అందజేయనుంది.

భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాల తొలి బుకింగ్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం సజ్జనర్‌కు టీఎస్‌ఆర్టీసీ బిజినెస్‌ హెడ్‌(లాజిస్టిక్స్‌) పి.సంతోష్‌ కుమార్‌ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోందన్నారు. ఎంతో విశిష్టమైన ఆ తలంబ్రాలను పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారనని పేర్కొన్నారు.

‘గత ఏడాది 88 వేల మంది బుక్‌ చేసుకుంటే.. ఈ సారి సోమవారం నాటికి రికార్డు స్థాయిలో ఒక లక్షమందికిపైగా భక్తులు తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. మొదటగా 50 వేల మందికి తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం హోండెలివరీ చేస్తోంది. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నాం. భక్తుల నుంచి వస్తోన్న వినతుల నేపథ్యంలో తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు పొడిగించాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అని  తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని సజ్జనార్‌ సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు. భక్తులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, ఎంతో విశిష్టమైన తలంబ్రాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు వినోద్‌ కుమార్‌, పీవీ మునిశేఖర్‌, సీటీఎం జీవనప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: పేపర్‌ లీక్‌.. టెన్త్‌ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top