
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్‌కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించినా.. రాకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది.
హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో కోర్టు తీర్పు అమలు చేయనందుకు సోమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన జయరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మాజీ సీఎస్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.