‘చెక్‌’లేని డ్యామ్‌లు.. నీరుగారుతున్న లక్ష్యం

TS Govt May Plans Construct Of Check Dams In Telangana - Sakshi

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు.. కోట్ల ప్రజాధనం వృథా

మూణ్నాళ్ల ముచ్చటగా మారిన నిర్మాణాలు

డిజైన్, నాణ్యత లోపాలతో దెబ్బతింటున్న వైనం

చాలాచోట్ల వరదకు కొట్టుకుపోవడంతో

మళ్లీ మరమ్మతులు.. నాయకులు, బినామీలు కాంట్రాక్టర్లుగా అవతారం

అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు.. రూ.3,825కోట్ల అంచనాతో 1,200 చెక్‌డ్యామ్‌లు మంజూరు

ముందుచూపు లేక మేడారంలో రూ.9.66కోట్లు దుబారా

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రంలో వట్టిపోయిన వాగులు, వంకలకు తిరిగి జీవం పోయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం పనులు ముగిసే నాటికి వివిధ వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అయితే కొందరు కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలాచోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో నాణ్యత లోపించి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. కొన్ని జిల్లాల్లో కాంట్రాక్టు ఏజెన్సీలున్న ప్రజాప్రతినిధులు ఈ పనులు చేపట్టారు. మరికొందరు బినామీలకు కట్టబెట్టారు. అయితే, చాలాచోట్ల నాణ్యత లోపించి చెక్‌డ్యామ్‌లు దెబ్బతింటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు రెండేళ్లలో 1,200 చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.3,825 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. వీటి నిర్మాణం తర్వాత సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలూ మెరుగుపడతాయని ప్రభుత్వం భావించింది. 2020–21 సంవత్సరంలో రూ.2,847.71కోట్లు కేటాయించింది. చిన్న వాగులపై చేపట్టే నిర్మాణాలకు కనిష్టంగా రూ.2.50లక్షలు, పెద్ద వాగులు, ఉప నదులపై కట్టడాలకు గరిష్టంగా రూ.11 కోట్లు ఇచ్చారు.

600 చెక్‌డ్యాంల కోసం టెండర్లు పిలవగా.. 91 నియోజకవర్గాల్లో 596 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఖరారయ్యాయి. పలు జిల్లాల్లో నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పోటీపడి టెండర్లు సాధించారు. చాలాచోట్ల అంచనా కన్నా తక్కువకు టెండర్లు దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో నాయకులు తమ అనుకూలురుకి పనులు దక్కేలా చూసుకున్నారు. అయితే, చాలాచోట్ల నిర్మాణంలో నాణ్యతను గాలికొదిలేశారు. దీంతో ప్రభుత్వ సమున్నత లక్ష్యం నీరుగారిపోతోంది. 

ఉదాహరణలెన్నో..
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 50 చెక్‌డ్యాంలు మంజూరు కాగా.. ఇందులో ఆదిలాబాద్‌లో 20 పూర్తి కాగా, నిర్మల్‌లో 21, ఆసిఫాబాద్‌లో రెండు పూర్తయ్యాయి. ఇక మంచిర్యాలలో పనులు చాలాచోట్ల సగమే పూర్తయ్యాయి. ఎక్కువచోట్ల వానాకాలంలో నిర్మాణ దశలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. అటవీ ప్రాంతంలో వరదకు కొన్నిచోట్ల కొట్టుకుపోవడంతో మళ్లీ మరమ్మతు పనులు చేపట్టారు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల కోట్ల నిధులు వృథా అయ్యాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు మానేరు వాగుపై చెక్‌డ్యాం నాసిరకంగా నిర్మించడంతో రెండు ముక్కలైంది. రూ.14.46 కోట్లకు టెండర్‌ ఆహ్వానించగా, కాంట్రాక్టర్‌ రూ.10.93 కోట్లకే దక్కించుకున్నారు. ప్రవాహానికి అనుగుణంగా డిజైన్‌ లేకపోవడం ప్రధాన లోపం కాగా, వానాకాలం ఆరంభంలో వరదలకు డ్యాం మధ్యభాగం రెండుగా విడిపోగా.. రెండోసారి వచ్చిన వరదకు రెండు వైపులా గోడల పక్కన మట్టి భారీగా కోతకు గురైంది. 

నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం బెజ్జోర గ్రామ సమీపంలో కప్పలవాగుపై రూ.5.75 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాం కట్ట వరదకు కొట్టుకుపోయింది. ఇరువైపులా వింగ్‌ వాల్స్‌ పక్కన మట్టి కోతకు గురైంది. చివరకు వాగు విస్తీర్ణం మేరకు రెండువైపులా గోడలు కట్టాల్సి ఉండగా.. వాగు లోపలి భాగంలోనే నిర్మించారని, నిర్మాణంలో నాణ్యత, డిజైన్‌లో లోపాలున్నాయని గుర్తించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల–మణుగూరు మార్గంలో మల్లన్నవాగుపై ఈ ఏడాదే నిర్మించిన చెక్‌డ్యాం కొద్దిపాటి వర్షాలు, వరదలకు కోతకు గురైంది. వాగు ఉధృతిని అంచనా వేయకుండా రెండువైపులా గట్లను కలుపుతూ డ్యాం కట్టారు. ఇప్పుడు వింగ్‌ వాల్స్‌కు ముప్పు ఏర్పడి మొత్తం నిర్మాణమే ప్రమాదంలో పడింది.

జనగామ జిల్లాలో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు అధికారుల పర్యవేక్షణా లోపంతో నాణ్యత లోపించింది. దేవరుప్పుల, గొల్లపల్లి, మున్‌పహాడ్‌ శివారులోని వాగు ప్రాంతంలో ఏడాది క్రితం రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టిన చెక్‌డ్యాంల సైట్‌ కట్టలు ఒక్క వర్షాకాలంలోనే బీటలువారి తెగాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం జప్తిసదగోడు వద్ద దుందుబీ వాగుపై రూ.6.78కోట్ల నిధులతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం 60% పూర్తయింది. గత ఆగస్టు 31న వచ్చిన దుందుబీ ప్రవాహానికి కుంగింది. చెక్‌డ్యాం దిమ్మె పగుళ్లు ఏర్పడి ఇసుకలోకి కూరుకుపోయింది.

ముక్కలైన రిటైనింగ్‌ వాల్‌
మానేరు రివర్‌ ఫ్రంట్‌లో భాగంగా కరీంనగర్‌ తీగల వంతెన దిగువన నిర్మించిన చెక్‌డ్యామ్‌ రిటైనింగ్‌ వాల్‌ పరిస్థితి ఇది. వరద ఉధృతికి ఇలా కొట్టుకుపోయింది. దీంతో రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. కరీంనగర్‌ నుంచి మాన కొండూర్‌ మండలం వేగురుపల్లి వరకు నీరు నిల్వ ఉండేలా రూ.12 కోట్ల వ్యయంతో చెక్‌డ్యామ్‌ నీళ్లు పక్కకు వెళ్లకుండా రిటైనింగ్‌ వాల్‌ కడుతుండగా ఎల్‌ఎండీ నుంచి నీళ్లు విడుదల చేయడంతో ఆ రిటైనింగ్‌ వాల్‌ ముక్కలైంది.

రూ. 9.66 కోట్లు దండగ..
ములుగు జిల్లా మేడారం జంపన్నవాగులో నాలుగు చోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. పడిగాపురం సమీపంలో రూ.4.51 కోట్లతో, రెడ్డిగూడెంలో రూ.2.88 కోట్లు, మేడారంలో రూ.2.75కోట్లు, ఊరట్టంలో రూ.3.42 కోట్లతో నిర్మించారు. కానీ, వాగులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పడిగాపురం చెక్‌డ్యాం మినహా మిగిలిన మూడు చెక్‌డ్యామ్‌లను కూల్చాలని నిర్ణయించారు. మూడింటి నిర్మాణానికి రూ.9.05కోట్లు వెచ్చించారు. కూల్చివేతకు మరో రూ.61 లక్షలు ఖర్చుచేశారు. అధికారులకు ముందుచూపు లేని కారణంగా రూ. 9.66 కోట్ల ప్రజాధనం నీళ్లపాలైంది. 

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతోనే.. 
నందిగడ్డ ప్రాంతంలో దుందుబీ వాగులో నిర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణంలో ఉండగానే కుంగిపోయింది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వరద ఉధృతికి చెక్‌డ్యాం తట్టుకోలేక కుంగిపోయి రైతుల పొలాలు కోతకు గురయ్యాయి. రూ.కోట్ల నిధులు వృథా అవుతున్నా అధికారులకు పట్టడం లేదు.
– అంతిరెడ్డి, రైతు, జప్తిసదగోడు, ఉప్పునుంతల మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

వారి ఆదేశాల మేరకే.. 
మేడారం జంపన్నవాగులో నీటిని నిల్వ చేసేందుకు మూడు చెక్‌డ్యాంలను నిర్మించారు. కానీ, నిల్వ ఉన్న నీటిలోపడి భక్తులు మరణిస్తుండటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరిగేషన్‌ శాఖ ఓఎస్‌డీ, కమిషనర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క లేఖలు, ఆదేశాల మేరకు కూల్చివేత పనులు చేపట్టాం. వాటి కూల్చివేతకు రూ.61 లక్షలు కేటాయించారు. -సదయ్య, డీఈఈ, జలవనరుల శాఖ, తాడ్వాయి

నిర్లక్ష్యంగా నిర్మాణం 
ప్రభుత్వం చెక్‌డ్యాంల కోసం నిధులిస్తే అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – బక్కురి మోహన్, రైతు, సుంకెట్, నిజామాబాద్‌ జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top