వాణీదేవిదే విజయం | TRS Candidate Vani Devi Wins Graduates MLC Election | Sakshi
Sakshi News home page

వాణీదేవిదే విజయం

Mar 21 2021 3:34 AM | Updated on Mar 21 2021 5:12 AM

TRS Candidate Vani Devi Wins Graduates MLC Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నువ్వా నేనా అన్నట్టు సాగిన ‘మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌’గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ పోరులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి విజయం సాధించారు. ఆమె ఎన్నికలకు కొత్త అయినప్పటికీ.. బీజేపీ అభ్యర్థి ఎన్‌.రాంచంద్రరావు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌లతో పోటీపడి పైచేయి సాధించారు. ఈ ఎన్నికలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ విజయానికి అవసరమైన ‘కోటా’ఓట్లు రాలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించగా.. మొత్తం 1,89,339 ఓట్లు వాణీదేవికి లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటును రాంచంద్రరావుకు వేసిన వారిలో 23 వేల మందికిపైగా రెండో ప్రాధాన్యతగా వాణీదేవికి వేశారు. 

సుదీర్ఘ లెక్కింపు తర్వాత.. 
17వ తేదీన ఉదయమే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై సుదీర్ఘంగా సాగింది. శనివారం రాత్రి ఫలితం ప్రకటించారు. నాలుగు రోజుల పాటు అటు రాజకీయ నేతలు, విశ్లేషకులతోపాటు సాధారణ ప్రజల్లో సైతం ఇది ఉత్కంఠ రేకెత్తించింది. తక్కువ ఓట్లు వచ్చిన వారందరినీ ఒక్కొక్కరిగా ఎలిమినేట్‌ చేస్తూ రాగా.. ప్రధాన ప్రత్యర్థి రామచంద్రరావు ఎలిమినేషన్‌ సమయానికి వాణీదేవికి కోటాకు మించి ఓట్లు లభించాయి. అయితే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో ఇతర అభ్యర్థులు ముందుకు దూసుకెళతారేమో అన్న అభిప్రాయం తొలుత వ్యక్తమైనా.. వాణీదేవి ముందుకు దూసుకెళ్లారు. ప్రథమ ప్రాధాన్యతతో 1,12,689 ఓట్లు పొందిన ఆమె.. రెండో ప్రాధాన్యతగా 76,650 ఓట్లు పొందారు. 

మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌ ఆధిక్యత 
ప్రధమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి చివరి వరకు అధికార టీఆర్‌ఎస్‌ ఆధిక్యత ప్రదర్శించింది. ఏడు రౌండ్లలో ప్రతి రౌండ్‌ ఓట్లలో 34 నుంచి 35 శాతం వరకు ఓట్లు వాణీదేవి ఖాతాలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావు ప్రతి రౌండ్‌లో 30 నుంచి 32 శాతం ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి 7 నుంచి 9 శాతం, టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణ ఒకటి నుంచి రెండు శాతం ఓట్లకు పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి ఫ్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు మాత్రం ప్రతి రౌండ్‌లో 14 నుంచి 16 శాతం వరకు ఓట్లు వచ్చాయి. 

రికార్డు ఎన్నిక ఇది 
గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత భారీగా 93 మంది పోటీ చేయడం, 67 శాతం పోలింగ్‌ జరగడం ఇదే తొలిసారి. ప్రథమ ప్రాధాన్యతలో తక్కువ ఓట్లు వచ్చినవారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్‌ చేస్తూ, రెండో ప్రాధాన్యత ఓట్లను కేటాయిస్తూ.. ఏకంగా 92 మందిని ఎలిమినేట్‌ చేసిన రికార్డు కూడా ఈ ఎన్నికదే. 
►మొత్తం 93 మంది అభ్యర్థుల్లో 84 మందికి కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. 
►ఒక అభ్యర్థికి కేవలం 8 ఓట్లు మాత్రమే వచ్చాయి 
►రెండంకెల ఓట్లు మాత్రమే వచ్చిన వారు 51 మంది, మూడంకెల ఓట్లు దక్కినవారు 32 మంది 
►ప్రధాన పోటీదారులు నలుగురు కాకుండా.. 5 వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినవారు ముగ్గురున్నారు. 

పట్టభద్ర ఓటర్లకు ధన్యవాదాలు: సీఎం కేసీఆర్‌
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను గెలిపించిన పట్టభద్రులకు సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. వారి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలను అభినందించారు. అలాగే వాణీదేవి, రాజేశ్వర్‌రెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు. వాణీదేవి శనివారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, గెలుపు కోసం కృషి చేసిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా వాణీదేవిని అభినందించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, సంతోష్‌ కుమార్, బడుగుల లింగ య్య యాదవ్, మంత్రులు హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్‌ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, కేపీ వివేకానంద, అబ్రహం, కృష్ణమోహన్‌ రెడ్డి, మెతుకు ఆనంద్, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement