‘పాటగూడ మాకొద్దు, అక్కడకు వెళ్లం.. ఇక్కడే ఉంటాం’

Tribals Arrange New Village Beliving Superstitions In Indravelli Mandal - Sakshi

ఇంద్రవెల్లి: మూఢ నమ్మకాల ఊబిలో చిక్కుకుని కొంతమంది గిరిజనులు గ్రామాన్ని వదిలి మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాటగూడ(కే) గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని పాటగూడ(కే) గ్రామంలో కోలం గిరిజన తెగకు చెందిన 85 కుటుంబాలు ఉన్నాయి. పాటగూడలో తమకు ఎలాంటి శుభకార్యాలు జరగడం లేదని, ఏదో రకంగా కీడు జరుగుతోందని, తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నామని కుమ్ర వంశానికి చెందిన 10 కుటుంబాలు, కోడప, ఆత్రం వంశానికి చెందిన మరో రెండు కుటుంబాలు.. ఆ గ్రామాన్ని వదిలి కొద్ది దూరంలో మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.

ఈ క్రమంలో ఈ నెల 12, 13న పాటగూడ గ్రామస్తులు ఒక పెళ్లి నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఆ 12 కుటుంబాలు పక్కనే ఉన్న కుమ్ర జంగు వ్యవసాయ చేనులో గుడిసెలు నిర్మించుకున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్‌ సీఐ నరేష్‌కుమార్, స్థానిక ఎస్‌ఐ నందిగామ నాగ్‌నాథ్‌ మంగళవారం పాటగూడ గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాలతో మాట్లాడారు. మూఢ నమ్మకాలకు దూరంగా కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి గొడవలూ చేయొద్దని సూచించగా, గ్రామాన్ని వదిలివెళ్లిన ఆ కుటుంబాలు వినిపించుకోలేదు. తమ కుటుంబసభ్యులు ఆ గ్రామంలో ఉంటే తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నారని, అందుకే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పాటగూడ గ్రామస్తులతో తమకు ఎలాంటి గొడవలూ లేవని వారు తేల్చి చెప్పడంతో పోలీసు అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
చదవండి:
ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top