కోల్‌కతా మీదుగా వేశ్యావాటికలకు రవాణా | Trapping Bangladesh Women And Transferred to Prostitue areas | Sakshi
Sakshi News home page

కోల్‌కతా మీదుగా వేశ్యావాటికలకు రవాణా 

Dec 5 2020 9:55 AM | Updated on Dec 5 2020 12:28 PM

Trapping Bangladesh Women And Transferred to Prostitue areas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ మానవ అక్రమరవాణా ముఠాలు నగరానికి తీసుకువచ్చే బంగ్లాదేశ్‌ యువతుల విషయంలో పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. భారత్‌లోకి తీసుకొచ్చాక.. కొన్నాళ్లు కోల్‌కతాలో ఉంచి వీరికి గుర్తింపు కార్డులు సృష్టిస్తున్నారు. అమాయక మహిళలను అక్రమంగా సరిహద్దులు దాటించి దేశంలోకి తీసుకురావడం, హింసించడం, వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మానవ అక్రమరవాణా ముఠాలో కొందరు పేరుకు భారతీయులుగా కనిపిస్తున్నా.. వారి మూలాలు బంగ్లాదేశ్‌లో ఉంటాయి. అంటే చాలా దశాబ్దాల క్రితమే అక్రమంగా దేశంలోకి ప్రవేశించి ఉంటారు. బంగ్లాలోని తమవారితో ఇంకా సంబంధాలు కొనసాగిస్తూ దందా నడుపుతున్నారు. అమ్మాయిలను అక్రమరవాణా చేసే సూత్రధారులు, వ్యభిచార గృహ నిర్వాహకులు, బాధిత యువతులు అంతా బంగ్లాదేశీయులే కావడం గమనార్హం. 2019లో బయటపడ్డ పహాడీషరీఫ్‌ సెక్స్‌రాకెట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన దంపతులు సూత్రధారులు కాగా, తాజాగా వెలుగులోకి వచి్చన అబ్దుల్లాపూర్‌మెట్‌ ఘటనలోనూ సూత్రధారి లిటన్‌ సర్కార్‌ది బంగ్లాదేశే. 

 బోర్డర్‌ నుంచి రాత్రికి రాత్రే కోల్‌కతాకు... 
భారతదేశానికి అక్రమంగా రవాణా చేసే యువతుల్లో ఎక్కువగా బంగ్లాదేశ్‌ దక్షిణ భాగానికి చెందిన వారే ఉండటం గమనార్హం. వీరు ఇండియాకు సమీపంలో ఉండటం, బంగ్లా దక్షిణాన రోహింగ్యాలు ఉండటం కూడా ఈ మాఫియాకు కలిసివస్తోంది. బెంగాల్‌లో దక్షిణభాగాన ఉన్న ‘ఉత్తర 24 పరగణా’జిల్లా ద్వారా అక్రమంగా యువతులను దేశంలోకి తీసుకువస్తారు. అక్కడ నుంచి కోల్‌కతా కేవలం ఎనభై కిలోమీటర్ల దూరం మాత్రమే. అర్ధరాత్రి మన భూభాగంలోకి వచ్చి ఉదయానికల్లా కోల్‌కతా చేరుకోవచ్చు. అక్కడి మురికివాడల్లో వీరిని కొంతకాలం ఉంచుతారు. నయానో.. భయానో వీరిని తమ దారికి తెచ్చుకుంటారు. ఎదురు తిరిగితే హింసిస్తారు. పైగా దేశంకాని దేశంలో అరెస్టు చేయిస్తామని, జైల్లో పెట్టిస్తామని భయపెడతారు.

అలా వీరిని వ్యభిచార కూపంలోకి దింపుతారు. అక్కడే వీరికి పేర్లు మార్చి, స్థానికులుగా చెలామణి అయ్యేందుకు గుర్తింపుకార్డులు, సిమ్‌కార్డులు సిద్ధం చేస్తారు. అందుకే, వీరు దేశంలో ఎక్కడ పట్టుబడ్డా.. బెంగాల్‌ గుర్తింపుకార్డులే లభిస్తాయి. 2019 సెపె్టంబరులో హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌లోనూ వేశ్యావాటికపై పోలీసులు దాడులు చేయగా.. విటులు, నిర్వాహకులతోపాటు నలుగురు అమాయక బంగ్లా యువతులు పట్టుబడ్డారు. వారి వద్ద పలు భారత గుర్తింపుకార్డులు, సిమ్‌కార్డులు, స్మార్ట్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. విదేశీయుల వద్ద భారత గుర్తింపు కార్డులు దొరకడం సంచలనం రేపింది. ఈ కేసు ఎన్‌ఐఏకు బదిలీ అయింది. తాజాగా అబ్దుల్లాపూర్‌మెట్‌ సెక్స్‌రాకెట్‌లోనూ బాధిత మహిళల పేర్లు మార్చి భారతీయులుగా చెలామణి చేసినట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. 

అనాథలు, పేదలు, రోహింగ్యాలు.. 
భారతదేశంలోని వేశ్యావాటికల్లో యువతులను అప్పగించేందుకు వీరు ముందుగా ఒప్పందం కుదుర్చుకుంటారు. వీరిచ్చే ఆర్డర్‌తో బంగ్లాదేశ్‌లోని లోకల్‌ ఏజెంట్లు అక్కడి పేదలు, అనాథలు, రోహింగ్యాలను ఉపాధి పేరిట తమతో వచ్చేందుకు ఒప్పిస్తారు. ఒకవేళ ఇలాంటి యువతులు తిరిగి వెళ్లకపోయినా.. పట్టించుకునే వారెవరూ ఉండరు. పేదలు కావడంతో తమవారు తిరిగి రాకపోయినా పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయరు. అక్రమరవాణా ముఠాలకు ఇదో ధీమా. భారతదేశానికి తీసుకువచ్చే యువతుల్లో రోహింగ్యాలు కూడా ఉండటం గమనార్హం. వీరికి స్థిరనివాసం లేకపోవడంతో అది భారత్‌ అయినా.. బంగ్లాదేశ్‌ అయినా ఒకటే. కాబట్టి, వీరు కుటుంబాల కోసం దేశాలు దాటుతుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement