రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్‌  | Sakshi
Sakshi News home page

రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్‌ 

Published Tue, Dec 5 2023 4:39 AM

Trains cancelled over cyclone - Sakshi

మిచాంగ్‌ తుపాను కారణంగా భారీగా రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఈ నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్‌: 040–2778666, 040–27801112 నాంపల్లి: 9676904334 కాచిగూడ: 040–27784453 

సాక్షి, హైదరాబాద్‌:  మిచాంగ్‌ తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. దక్షిణమధ్య రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 150 రైళ్లను అధికారులు ఇప్పటికే రద్దు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్‌ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లకు కూడా బ్రేక్‌ పడింది.

కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్‌–తాంబరం, సికింద్రాబాద్‌–కొల్లాం, సికింద్రాబాద్‌–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్‌–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్‌–గూడూరు, సికింద్రాబాద్‌–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. అటు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగనుందని అధికారులు తెలిపారు. 

పలుచోట్ల ఇప్పటికే వరదలు మొదలు 
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురిసి, వరదలు పారుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ ప్రాంతాల్లో రైల్వేలైన్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వరదలు, నీటి ప్రవాహం కారణంగా పట్టాలపై నీరు నిలిచి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటికే పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టడంతోపాటు ఎప్పటికప్పుడు వరద నీటిని తొలగించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. 

ప్రయాణాలను వాయిదా వేసుకోండి 
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో కొన్నింటిని ప్రధాన స్టేషన్‌లకే పరిమితం చేశారు. అత్యవసరమైతే తప్ప తుపాను ప్రభావిత ప్రాంతాల దిశగా ప్రయాణాలు వద్దని, ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నవారు వాయిదా వేసుకోవడం మంచిదని ప్రయాణికులకు సూచిస్తున్నారు. తుఫాన్‌ కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకొనే వారికి పూర్తిస్థాయిలో చార్జీలను తిరిగి చెల్లించనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలోని బుకింగ్‌ కేంద్రాల్లో టికెట్లను రద్దు చేసుకోవచ్చు. 

అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు 
తుపాను కారణంగా హైదరాబాద్‌ నుంచి కొల్లాం వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్‌ నుంచి శబరిమలకు వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసుకున్న అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి శబరిమలకు రైళ్లు తక్కువగా ఉన్నాయని, రద్దు కారణంగా వేరే రైళ్లలో టికెట్లు దొరికే పరిస్థితి లేదని చెప్తున్నారు. వాహనాల్లో అంతదూరం ప్రయాణించడం ఇబ్బందికరమేనని అంటున్నారు.  

రైల్‌ నిలయం నుంచి పర్యవేక్షణ 
తుపాను ప్రభావం ఉండే ప్రాంతాలకు వెళ్లే రైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమన్వయం చేసుకుంటూ రైళ్లను నడపాలని పేర్కొన్నారు.

ఈ మేరకు అదనపు జనరల్‌ మేనేజర్‌ ధనంజయులు నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు రైల్‌నిలయం నుంచి తుపాను పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వారు డివిజనల్‌ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. తుపాను పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన సామాగ్రిని, యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. వంతెనలు, వరద పోటెత్తే ప్రదేశాల్లో వాచ్‌మన్‌లను ఏర్పాటు చేశారు. పట్టాలపై నిలిచే వరదనీటిని తొలగించేందుకు డీజిల్‌ పంపులను సిద్ధం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement