కేబినెట్‌కు దూరంగా.. ఆ మూడు జిల్లాలు | Three More Districts Pendinge in Telangana Cabinet Expansion | Sakshi
Sakshi News home page

కేబినెట్‌కు దూరంగా.. ఆ మూడు జిల్లాలు

Jun 9 2025 4:17 AM | Updated on Jun 9 2025 4:18 AM

Three More Districts Pendinge in Telangana Cabinet Expansion

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల ప్రాతినిధ్యం ఇంకా పెండింగే 

సాక్షి, హైదరాబాద్‌: తాజా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చోటు లభించగా, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల ప్రాతినిధ్యం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తొలి విడత కేబినెట్‌లో చోటు దక్కని నాలుగు జిల్లాల్లో ఆదిలాబాద్‌ నుంచి వివేక్‌ మంత్రిగా ప్రమాణం చేయగా, గతంలో ప్రాతినిధ్యం ఉన్న మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల నుంచే మరో ఇద్దరు మంత్రులయ్యారు.

అయితే కరీంనగర్, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి కేబినెట్‌లో ఇప్పటికే ఇద్దరు చొప్పున ఉండగా, ఇప్పుడు ఒకొక్కరి చేరికతో ఆ రెండు జిల్లాల ప్రాతినిధ్యం మూడుకు పెరిగింది. కరీంనగర్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ తోడుగా ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్‌ చేరారు. సీఎం రేవంత్‌తోపాటు జూపల్లి కృష్ణారావులు మహబూబ్‌నగర్‌ నుంచి మంత్రివర్గంలో ఇప్పటికే ఉండగా కొత్తగా వాకిటి శ్రీహరి చేరారు. దీంతో ఇప్పటికే ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లా (భట్టి, పొంగులేటి, తుమ్మల) సరసన కరీంనగర్, మహబూబ్‌నగర్‌లు కూడా చేరాయి. 

భవిష్యత్‌లో ఏమవుతుందో..? 
మరోమారు కేబినెట్‌ విస్తరణ జరిగితే మాత్రం నిజామాబాద్‌ జిల్లాకు స్థానం ఖాయమని..సీనియర్‌ నేత పి.సుదర్శన్‌రెడ్డి పేరును ఈసారే ప్రకటించాల్సి ఉన్నా సామాజిక సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాక చివరి క్షణంలో తొలగించారని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి. ఇప్పటికే స్పీకర్‌ పోస్టు ఉన్న రంగారెడ్డి జిల్లా ఈసారికి చీఫ్‌ విప్‌ పదవితో సరిపెట్టుకోవాల్సిందేనని, మంత్రి పదవికి అనుకూల సమీకరణలు ఈ జిల్లాలో లేవని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రంగారెడ్డి జిల్లాకు మంత్రిపదవి కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ నేతల కొరత కారణంగా కేబినెట్‌ బెర్తు ఎలా భర్తీ చేయాలో ఆ పార్టీ అధిష్టానానికి కూడా అర్థం కావడం లేదని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement